వేగానికి కాదు.. సమస్యను తప్పించుకోవడానికే.. కీబోర్డులో QWERTY వెనుక కథ ఇదే!
Add ap7am to your home Screen

వేగానికి కాదు.. సమస్యను తప్పించుకోవడానికే.. కీబోర్డులో QWERTY వెనుక కథ ఇదే!

QWERTY keyboard story is about avoiding problems not just speed
  • కీబోర్డులో మొదట ABCDకి బదులు QWERTY ఉండటానికి కారణం 19వ శతాబ్దపు టైప్‌రైటర్లే
  • టైప్‌రైటర్ కీళ్లు ఇరుక్కుపోకుండా ఉండేందుకు అక్షరాలను వేరుగా అమర్చిన వైనం
  • ఈ డిజైన్‌ను రూపొందించిన ఆవిష్కర్త క్రిస్టఫర్ షోల్స్ 
  • ఆధునిక కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోనూ కొనసాగుతోన్న‌ అదే డిజైన్
మనం రోజూ వాడే కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ కీబోర్డును ఒకసారి గమనిస్తే... అక్షరాలు Q, W, E, R, T, Y వరుసతో మొదలవుతాయి. అసలు వాటిని A, B, C, D క్రమంలో ఎందుకు అమర్చలేదు అనే సందేహం చాలా మందికి వస్తుంది. దీని వెనుక ఉన్న కారణం ఆధునిక టెక్నాలజీకి సంబంధించింది కాదు, ఏకంగా 19వ శతాబ్దానికి చెందిన టైప్‌రైటర్ల ఆవిష్కరణతో ముడిపడి ఉంది.

1860-70 దశకాల్లో అమెరికన్ ఆవిష్కర్త క్రిస్టఫర్ లాథమ్ షోల్స్ తన సహచరులతో కలిసి టైప్‌రైటర్లను అభివృద్ధి చేశారు. తొలినాళ్లలో ఆయన తయారు చేసిన యంత్రాల్లో అక్షరాలను ABCD క్రమంలోనే, పియానో కీళ్లలా అమర్చారు. అయితే, మెకానికల్ టైప్‌రైటర్లలో ప్రతి అక్షరానికి ఒక టైప్‌బార్ (లోహపు కడ్డీ) ఉండేది. 

కీ నొక్కినప్పుడు అది పైకి లేచి, ఇంక్ రిబ్బన్‌పై కొట్టి కాగితంపై అక్షరాన్ని ముద్రించేది. వేగంగా టైప్ చేస్తున్నప్పుడు పక్కపక్కనే ఉన్న అక్షరాల కీళ్లను ఒకేసారి నొక్కితే, ఆ టైప్‌బార్లు ఒకదానికొకటి తగిలి ఇరుక్కుపోయేవి (జామ్ అయ్యేవి). ఇది టైపింగ్ చేయడానికి పెద్ద అడ్డంకిగా మారింది.

ఈ యాంత్రిక సమస్యను అధిగమించడానికి షోల్స్ అక్షరాల అమరికపై అనేక ప్రయోగాలు చేశారు. ఇంగ్లీష్ భాషలో ఎక్కువగా వాడే అక్షరాల జంటలను (ఉదాహరణకు 'th', 'er') కీబోర్డుపై వీలైనంత దూరంగా అమర్చారు. ఈ క్రమంలోనే 'QWERTY' లేఅవుట్ పుట్టింది. ఈ కొత్త డిజైన్‌తో టైప్‌బార్ల మధ్య ఘర్షణ తగ్గి, సాఫీగా టైప్ చేయడానికి వీలు కలిగింది. 

టెలిగ్రాఫ్ ఆపరేటర్ల నుంచి వచ్చిన సూచనలు కూడా ఈ మార్పునకు దోహదపడ్డాయని చరిత్రకారులు చెబుతారు. 1870లలో ఇ. రెమింగ్టన్ & సన్స్ సంస్థ ఈ క్యూవర్టీ టైప్‌రైటర్లను వాణిజ్యపరంగా భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి టైపింగ్ శిక్షణలోనూ ఇదే పద్ధతిని నేర్పించడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాణంగా స్థిరపడిపోయింది.

'క్యూవర్టీ' విజయవంతమయ్యాక, దానికి ప్రత్యామ్నాయంగా మరిన్ని మెరుగైన కీబోర్డ్ లేఅవుట్‌లు ప్రతిపాదనకు వచ్చినా అప్పటికే లక్షలాది మంది క్యూవర్టీకి అలవాటు పడిపోయారు. శిక్షణ, వాడకంలో పాతుకుపోయిన ఒక పద్ధతిని మార్చడం కష్టసాధ్యంగా మారింది. 

అదే పరంపరలో ఎలక్ట్రిక్ టైప్‌రైటర్ల నుంచి నేటి ఆధునిక కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, చివరకు మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ల వర్చువల్ కీబోర్డుల వరకు అదే క్యూవర్టీ డిజైన్ కొనసాగుతోంది. వేగం లేదా సౌకర్యం కోసం కాకుండా, ఒక చారిత్రక అవసరం, వాణిజ్య విజయాల కారణంగానే క్యూవర్టీ నేటికీ మన డిజిటల్ జీవితంలో అంతర్భాగంగా కొనసాగుతోందని చెప్పవచ్చు.
Advertisement
QWERTY keyboard
Christopher Latham Sholes
Typewriter history
Keyboard layout origin
Remington typewriters
Typing standards

More Telugu News