ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి 2026.. రాబర్ట్‌ హాల్‌, మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌కు పురస్కారం
Add ap7am to your home Screen

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి 2026.. రాబర్ట్‌ హాల్‌, మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌కు పురస్కారం

Robert Hall and Michael Woodford win 2026 Nobel Prize in Economics
  • స్థూల ఆర్థిక స్థిరీకరణకు అవసరమైన సూక్ష్మ ఆర్థిక పునాదులపై పరిశోధనకు గుర్తింపు
  • స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హాల్‌
  • వుడ్‌ఫోర్డ్‌ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న వుడ్‌ఫోర్డ్‌ 
  • ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల ఆర్థిక విధాన నిర్ణయాలకు వీరి పరిశోధనలు ప్రయోనకరం
  • ఆర్థిక శాస్త్ర బహుమతిని స్వీడన్‌ కేంద్ర బ్యాంకు 1968లో ఏర్పాటు
ఆర్థిక శాస్త్రంలో 2026 నోబెల్‌ బహుమతిని అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్‌ ఈ. హాల్‌, మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌కు ప్రకటించారు. స్థూల ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులను నియంత్రించేందుకు ఉపయోగపడే నమూనాల రూపకల్పనకు అవసరమైన సూక్ష్మ ఆర్థిక పునాదులపై వారు చేసిన పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది. స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది.

రాబర్ట్‌ ఈ. హాల్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మైఖేల్‌ వుడ్‌ఫోర్డ్‌ కొలంబియా యూనివర్సిటీలో రాజకీయ ఆర్థికశాస్త్ర విభాగంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. వీరి పరిశోధనలు ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, మాంద్యం వంటి పరిస్థితులను ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు తోడ్పడతాయి. ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకునే మార్పులను అర్థం చేసుకుని తగిన విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ అధ్యయనాలు కీలకంగా నిలుస్తాయి.

ఆర్థిక శాస్త్రంలో ఈ పురస్కారాన్ని అధికారికంగా ‘ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ స్మారకార్థం స్వెరిజెస్‌ రిక్స్‌బ్యాంక్‌ ఆర్థిక శాస్త్ర బహుమతి’ అని పిలుస్తారు. స్వీడన్‌ కేంద్ర బ్యాంకు 1968లో దీన్ని ఏర్పాటు చేసింది. 1969లో తొలిసారిగా ప్రదానం చేశారు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తన వీలునామాలో పేర్కొన్న అసలు ఐదు నోబెల్‌ బహుమతుల్లో ఆర్థిక శాస్త్ర పురస్కారం లేదు. అయినప్పటికీ మిగతా నోబెల్‌ పురస్కారాలతో పాటే ఏటా డిసెంబర్‌ 10న దీన్ని అందజేస్తారు. 1896లో అదే రోజున నోబెల్‌ మరణించారు.

2025లో ఈ బహుమతి జోయెల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియోన్‌, పీటర్‌ హోవిట్‌లకు లభించింది. సాంకేతిక పురోగతి, నూతన ఆవిష్కరణలు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఎలా దోహదపడతాయో వివరించినందుకు వారిని ఎంపిక చేశారు.


Advertisement
Robert Hall
Michael Woodford
Nobel Prize in Economics 2026
Macroeconomics
Royal Swedish Academy of Sciences
Economic Sciences Prize

More Telugu News