ఐటీ దిగ్గజ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డు ప్రక్రియ నిలిపివేత!
Add ap7am to your home Screen

ఐటీ దిగ్గజ కంపెనీలపై అమెరికా కొరడా.. గ్రీన్ కార్డు ప్రక్రియ నిలిపివేత!

Donald Trump suspends Green Card PERM process for major IT companies
  • హెచ్-1బీ వీసాదారుల గ్రీన్ కార్డు ప్రక్రియపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం
  • మైక్రోసాఫ్ట్, అడోబ్‌తో పాటు ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి భారత ఐటీ కంపెనీల సస్పెన్షన్
  • పెర్మ్ సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి ఈ కంపెనీలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన
  • అమెరికన్ ఉద్యోగులను తొలగించి విదేశీయులను నియమించుకుంటున్నారని ఆరోపణ
  • ప్రస్తుత హెచ్-1బీ వీసాలపై ప్రభావం లేదు, కానీ గ్రీన్ కార్డు దరఖాస్తులు నిలిపివేత
అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కల్పించే ప్రక్రియలో కీలకమైన 'శాశ్వత కార్మిక ధ్రువీకరణ (పెర్మ్)' కార్యక్రమం నుంచి మైక్రోసాఫ్ట్, అడోబ్‌తో పాటు పలు భారత ఐటీ దిగ్గజ కంపెనీలను సస్పెండ్ చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, క్యాప్‌జెమినీ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి.

ఈ నిర్ణయంతో అమెరికా కార్మిక శాఖ ఇకపై ఈ కంపెనీల నుంచి కొత్త పెర్మ్ దరఖాస్తులను స్వీకరించదు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించదు. అయితే, ఈ చర్యల ప్రభావం ప్రస్తుత హెచ్-1బీ వీసాలపై ఉండదని, కేవలం గ్రీన్ కార్డు మంజూరు ప్రక్రియపైనే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కంపెనీలలో పనిచేస్తున్న విదేశీయులు గ్రీన్ కార్డు పొందడం ఇకపై దాదాపు అసాధ్యంగా మారనుంది.

ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. "అమెరికాలో ఈ వ్యవస్థను మైక్రోసాఫ్ట్ కంటే ఎక్కువగా ఎవరూ దుర్వినియోగం చేయలేదు. ఆ సంస్థ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించి, దాదాపు 6,300 హెచ్-1బీ వీసాలు, 3,000 గ్రీన్ కార్డులు పొందింది. ఇది అమెరికన్ల స్థానంలో విదేశీ బానిసలను నియమించుకోవడమే" అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్‌లింగ్ మాట్లాడుతూ, 2009 నుంచి ఈ కంపెనీలు దాదాపు 30 లక్షల మంది విదేశీ కార్మికుల కోసం దరఖాస్తు చేసుకున్నాయని, వాటిలో 2,30,000 హెచ్-1బీ వీసాలు, లక్షకు పైగా పెర్మ్ సర్టిఫికేషన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సంస్థలు మోసాలకు పాల్పడుతూ, తక్కువ వేతనాలకు విదేశీయులను నియమించుకుని అమెరికన్ల ఉద్యోగాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సబ్‌పోనలు జారీ చేశామని, పలు ఫెడరల్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు, విద్యార్థి వీసాల దుర్వినియోగం ఆరోపణలపై హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫోర్డ్ సహా తొమ్మిది విశ్వవిద్యాలయాలపై కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు ప్రకటించారు.

ఏమిటీ పెర్మ్ ప్రోగ్రాం?
అమెరికాలో ఒక విదేశీ ఉద్యోగికి గ్రీన్ కార్డు స్పాన్సర్ చేయాలంటే, సదరు ఉద్యోగానికి తగిన నైపుణ్యం, అర్హతలున్న అమెరికన్ పౌరులు ఎవరూ అందుబాటులో లేరని యజమాని నిరూపించాలి. దీనికోసం చేపట్టే ప్రక్రియే పెర్మ్. ఇది ఆమోదం పొందాకే గ్రీన్ కార్డు కోసం తదుపరి దశ అయిన I-140 పిటిషన్‌ను దాఖలు చేయడానికి వీలవుతుంది. తాజా సస్పెన్షన్‌తో ఈ కంపెనీలకు ఆ మార్గం మూసుకుపోయింది. ఈ నిషేధం ఎప్పటివరకు కొనసాగుతుందనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
Advertisement
Donald Trump
Green Card PERM suspension
US H1B visa news
Microsoft TCS Infosys ban
US Department of Labor
Indian IT professionals USA

More Telugu News