పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేస్తే భారీగా నష్టపోతారు!
Advertisement

పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేస్తే భారీగా నష్టపోతారు!

Taking a personal loan You will lose heavily if you make these 5 mistakes
  • తక్కువ వడ్డీ రేటు చూసి వెంటనే లోన్‌ తీసుకోవద్దంటున్న నిపుణులు
  • అవసరానికి మించి రుణం తీసుకోకపోవడం  మేలు
  • ఈఎంఐ తక్కువగా ఉందని ఎక్కువ కాలం ఎంచుకుంటే నష్టం మనకే
  • ముందస్తు చెల్లింపు ఛార్జీలు ముందే తెలుసుకోవడం బెటర్‌
  • ఈఎంఐ ఆలస్యమైతే క్రెడిట్‌ రికార్డుపై ప్రభావం పడే ఛాన్స్‌
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు పర్సనల్‌ లోన్‌ చాలా ఉపయోగపడుతుంది. వైద్య ఖర్చులు, ఇంటి పనులు, అనుకోని ఆర్థిక అవసరాలకు వెంటనే డబ్బు అందుతుంది. కానీ లోన్‌ తీసుకునేటప్పుడు బ్యాంకు ఎంత ఇస్తుందనే దానిపైనే దృష్టి పెడితే సమస్యలు మొదలవుతాయి. వడ్డీతో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఛార్జీలు, లోన్‌ కాలవ్యవధి కూడా మొత్తం ఖర్చును పెంచుతాయి. అందుకే లోన్‌ తీసుకునే ముందు ఈ ఐదు తప్పులకు దూరంగా ఉండాలి.

తక్కువ వడ్డీ కనిపించిందని..
లోన్‌ ప్రకటనల్లో తక్కువ వడ్డీ రేటు కనిపించగానే అది చౌకైన లోన్‌ అనుకోవద్దు. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఛార్జీలు ఎక్కువగా ఉంటే చివరికి మీరు చెల్లించే మొత్తం పెరగొచ్చు. అందుకే వడ్డీ రేటుతో పాటు మొత్తం లోన్‌ ఖర్చును పోల్చాలి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణదాతలు ‘కీ ఫ్యాక్ట్స్‌ స్టేట్‌మెంట్‌ (కేఎఫ్‌ఎస్‌)’లో వార్షిక రుణ వ్యయం, సంబంధిత ఛార్జీలను వెల్లడించాలి.

అవసరానికి మించి లోన్‌ తీసుకోవద్దు
బ్యాంకు రూ.8 లక్షలు ఇస్తామని చెప్పిందని మొత్తం రూ.8 లక్షలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఎంత ఉందో అంతే తీసుకోవాలి. తీసుకున్న ప్రతి అదనపు రూపాయిపై వడ్డీ చెల్లించాలి. కాబట్టి ముందుగా మీ నెలవారీ ఆదాయం, ఖర్చులు చూసుకుని ఎంత ఈఎంఐ కట్టగలరో నిర్ణయించుకోవాలి.

ఈఎంఐ తక్కువగా ఉందని
లోన్‌ కాలవ్యవధి ఎక్కువగా ఉంటే నెలవారీ ఈఎంఐ తగ్గుతుంది. దీంతో లోన్‌ సులభంగా కట్టేయగలమని అనిపిస్తుంది. కానీ ఎక్కువ సంవత్సరాలు వడ్డీ చెల్లించాల్సి రావడంతో చివరకు బ్యాంకుకు చెల్లించే మొత్తం పెరుగుతుంది. తక్కువ కాలవ్యవధి అయితే ఈఎంఐ ఎక్కువగా ఉండొచ్చు. కానీ మొత్తం వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే మీ ఆదాయానికి సరిపోయే కాలవ్యవధిని ఎంచుకోవాలి.

ముందే లోన్‌ కట్టేయాలనుకుంటే..
కొంతమంది బోనస్‌, ఇతర ఆదాయం వచ్చినప్పుడు లోన్‌ను ముందుగానే కట్టేయాలని అనుకుంటారు. అలా చేయాలంటే ముందుగా పార్ట్‌ పేమెంట్‌, ఫోర్‌క్లోజర్‌ ఛార్జీలు ఉన్నాయా చూడాలి. బ్యాంకును బట్టి ఈ నిబంధనలు మారొచ్చు. లోన్‌ తీసుకునే ముందే వీటి గురించి తెలుసుకోవాలి.

ఈఎంఐ ఆలస్యం చిన్న విషయం కాదు
ఒక్క ఈఎంఐ ఆలస్యమైతే పెనాల్టీతో సరిపోదు. మీరు తీసుకున్న లోన్‌ను సకాలంలో చెల్లిస్తున్నారా? లేదా? అన్న వివరాలు క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు వెళతాయి. పదేపదే ఈఎంఐ ఆలస్యం చేస్తే మీ క్రెడిట్‌ రికార్డుపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. భవిష్యత్తులో లోన్‌ తీసుకోవడం కష్టంగా మారొచ్చు లేదా ఎక్కువ ఖర్చు కావొచ్చు. అందుకే ఈఎంఐ తేదీని ఎప్పుడూ మిస్‌ కాకుండా చూసుకోవాలి.

ఒకేసారి చాలా లోన్లకు అప్లై చేయొద్దు
ఇన్‌స్టంట్‌ లోన్‌ వస్తుందనే ఉద్దేశంతో ఒకేసారి చాలా బ్యాంకులు, సంస్థలకు అప్లై చేయడం కూడా మంచిది కాదు. ప్రతి దరఖాస్తుతో క్రెడిట్‌ ఎంక్వైరీ జరగొచ్చు. పైగా ఇప్పటికే ఉన్న ఈఎంఐలతో పాటు మరో లోన్‌ తీసుకుంటే నెలవారీ ఆర్థిక భారం పెరుగుతుంది.

లోన్‌ తీసుకునే ముందు కేఎఫ్‌ఎస్‌, శాంక్షన్‌ లెటర్‌, లోన్‌ ఒప్పందం పూర్తిగా చదవాలి. వడ్డీ, మొత్తం రుణ వ్యయం, ప్రాసెసింగ్‌ ఫీజు, ఈఎంఐ, కాలవ్యవధి, ఆలస్య చెల్లింపు ఛార్జీలు, ముందస్తు చెల్లింపు నిబంధనలు అన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా డిజిటల్‌ లోన్ల విషయంలో ఏపీఆర్‌, ఇతర ఛార్జీలను ముందుగానే వెల్లడించాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి.
Advertisement
Personal Loan
Personal Loan Mistakes
Credit Score Tips
Loan Interest Rates
Debt Management
EMI Tenure Calculation

More Telugu News