ఆరంభంలో వెనుకంజ.. చివర్లో పతకాల పంజా! ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు
Advertisement

ఆరంభంలో వెనుకంజ.. చివర్లో పతకాల పంజా! ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు

India shines in Asian Games with a late medal surge
  • ముగిసిన ఆసియా క్రీడలు.. భారత్ కు 4వ స్థానం
  • భారత్‌ ఖాతాలో 21 స్వర్ణాలు సహా 85 పతకాలు
  • ఆసియా క్రీడల్లో టాప్‌-5లో నిలిచిన భారత్‌
  • చివరి రెండు రోజుల్లో 11 స్వర్ణాలు
  • హాకీ, క్రికెట్‌, కబడ్డీలో డబుల్‌ స్వర్ణాలు
  • అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 24 పతకాలు
రెండు రోజుల క్రితం పతకాల పట్టికలో భారత్‌ టాప్‌-10లో కూడా లేదు. తర్వాత పుంజుకొని టాప్‌-5లోకి దూసుకొచ్చింది. ఆరంభంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా.. చివరి రెండు రోజుల్లో భారత క్రీడాకారులు అద్భుతాలు చేశారు. వరుసగా స్వర్ణాలు సాధిస్తూ పతకాల వేటలో కొత్త ఊపు తీసుకొచ్చారు. హాకీ, క్రికెట్‌ నుంచి ఆర్చరీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌ వరకు సత్తా చాటారు. మొత్తంగా 21 స్వర్ణాలు సహా 85 పతకాలతో ఆసియా క్రీడల ప్రస్థానాన్ని 4వ స్థానంతో ముగించారు. కొన్ని విభాగాల్లో నిరాశ ఎదురైనా.. మరికొన్ని క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.

చివర్లో ఒక్కసారిగా జోరు!
ఆసియా క్రీడల్లో భారత్‌ ప్రస్థానం ఒడుదొడుకులతో సాగింది. గురువారం నాటికి ఖాతాలో 10 స్వర్ణాలు మాత్రమే ఉన్నాయి. పతకాల పట్టికలో టాప్‌-10 కింద నిలిచింది. అయితే చివరి రెండు రోజుల్లో సీన్‌ మారిపోయింది. క్రికెట్‌, హాకీ జట్లు పసిడి పతకాలు సాధించాయి. ఆర్చరీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌లోనూ భారత క్రీడాకారులు మెరిశారు. దీంతో చివరి రెండు రోజుల్లోనే మరో 11 స్వర్ణాలు ఖాతాలో చేరాయి. భారత్‌ టాప్‌-5లోకి దూసుకొచ్చింది.

హాకీలో చరిత్ర.. క్రికెట్‌లోనూ పసిడి
ఈసారి భారత హాకీ జట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళల జట్టు 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణం గెలుచుకుంది. పురుషుల జట్టు కూడా మలేసియాపై 5-1తో ఘన విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఒకే ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళల జట్లు స్వర్ణాలు గెలవడం ఇదే తొలిసారి. ఈ విజయాలతో రెండు జట్లూ 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాయి. క్రికెట్‌లోనూ పురుషులు, మహిళలు స్వర్ణాలు గెలిచి భారత్‌ ఖాతాలో పసిడి పతకాలు జమ చేశారు. కబడ్డీలోనూ ఇరు జట్లు స్వర్ణ విజేతలుగా నిలిచాయి.

ఆర్చరీలో అమ్మాయిల అదుర్స్‌!
ఆర్చరీలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ విభాగంలో ఐదు స్వర్ణాలు సహా మొత్తం 9 పతకాలు సాధించారు. మహిళల వ్యక్తిగత రికర్వ్‌లో 17 ఏళ్ల కుమ్‌కుమ్‌ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా నిలిచింది. మహిళల రికర్వ్‌ జట్టు కూడా తొలిసారి పసిడి పతకాన్ని అందుకుంది. నీరు ధండా షూటింగ్‌లో మహిళల ట్రాప్‌ విభాగంలో స్వర్ణం గెలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌ వ్యక్తిగత స్వర్ణంతో మెరిసింది.

అథ్లెటిక్స్‌లో అత్యధిక పతకాలు
భారత్‌కు అత్యధిక పతకాలు అందించింది అథ్లెటిక్సే. ఈ విభాగంలో 24 పతకాలు వచ్చాయి. ఒక స్వర్ణం, 9 రజతాలు, 14 కాంస్యాలు దక్కాయి. షూటింగ్‌లో 15, ఆర్చరీలో 9 పతకాలు లభించాయి. బాక్సింగ్‌, రెజ్లింగ్‌లో చెరో ఆరు పతకాలు వచ్చాయి. రెజ్లింగ్‌లో అమన్‌ శెహ్రావత్‌, సుజీత్‌ కల్కల్‌ స్వర్ణాలు సాధించగా.. లవ్లీనా బోర్గోహెయిన్‌, పర్వీన్‌ హూడా, అంకుశ్‌ పంఘాల్‌ బాక్సింగ్‌లో పసిడి పతకాలు గెలిచారు.

గతంతో పోలిస్తే తగ్గిన పతకాలు
గత ఆసియా క్రీడలతో పోలిస్తే ఈసారి భారత్‌ పతకాల సంఖ్య తగ్గింది. 2022 హాంగ్‌జౌ క్రీడల్లో 106 పతకాలు సాధించిన భారత్‌.. ఈసారి 85 పతకాలకే పరిమితమైంది. స్వర్ణాల సంఖ్య కూడా 28 నుంచి 21కి పడిపోయింది. ముఖ్యంగా షూటింగ్‌లో ఏడు స్వర్ణాల నుంచి మూడింటికి తగ్గాయి. అథ్లెటిక్స్‌లో గతంలో ఆరు స్వర్ణాలు సాధించగా.. ఈసారి ఒక్క పసిడి మాత్రమే దక్కింది. రోయింగ్‌, బ్యాడ్మింటన్‌లోనూ పతకాలు తగ్గాయి. టెన్నిస్‌, ఈక్వెస్ట్రియన్‌లో ఈసారి ఒక్క పతకం కూడా రాలేదు.

కొత్త రికార్డులు.. మరింత ఉత్సాహం
పతకాల సంఖ్య తగ్గినా.. ఈసారి పలువురు భారత క్రీడాకారులు వ్యక్తిగతంగా చరిత్ర సృష్టించారు. మహిళల హాకీ జట్టు నాలుగు దశాబ్దాలకు పైగా ఎదురుచూసిన స్వర్ణాన్ని అందుకుంది. ఆర్చరీ, గోల్ఫ్‌, షూటింగ్‌, రెజ్లింగ్‌లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. మొత్తంగా 20 క్రీడాంశాల్లో పతకాలు సాధించిన భారత్‌.. చివరి వరకు పోరాడి టాప్‌-5లో నిలిచింది. కొన్ని విభాగాల్లో వెనుకబడినా.. మరికొన్ని క్రీడల్లో సాధించిన అపూర్వ విజయాలు ఈ ఆసియా క్రీడలను భారత క్రీడాభిమానులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేశాయి.

అగ్రస్థానంలో చైనా
పతకాల పట్టికలో చైనా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశం ఏకంగా 169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలతో మొత్తం 341 పతకాలు సాధించింది. ఆ తర్వాత ఆతిథ్య జపాన్‌ 83 స్వర్ణాలు, 95 రజతాలు, 91 కాంస్యాలతో 269 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా 39 స్వర్ణాలు, 43 రజతాలు, 68 కాంస్యాలతో 150 పతకాలతో మూడో స్థానంలో ఉంది. భారత్‌ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్‌ 21 స్వర్ణాలు, 25 రజతాలు, 24 కాంస్యాలతో 70 పతకాలతో ఐదో స్థానంలో ఉంది.
Advertisement
India
Asian Games
Indian Hockey Team
Indian Cricket Team
Archery Gold Medal
Indian Athletes Performance

More Telugu News