‘ఇంత దిగజారిపోయామా?’.. ‘చుట్టమల్లే’ మార్ఫింగ్‌ వీడియోపై ఎన్టీర్‌కు విజయ్‌ దేవరకొండ మద్దతు
Advertisement

‘ఇంత దిగజారిపోయామా?’.. ‘చుట్టమల్లే’ మార్ఫింగ్‌ వీడియోపై ఎన్టీర్‌కు విజయ్‌ దేవరకొండ మద్దతు

Vijay Deverakonda supports Jr NTR over Chuttamalle morphed video and slams AI misuse
  • ఏఐ దుర్వినియోగంపై విజయ్‌ ఆగ్రహం
  • చుట్టమల్లే మార్ఫింగ్‌ వీడియో విషయంలో ఎన్టీఆర్‌కు పూర్తి మద్దతు
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న విజయ్‌
  • సమాజం తీరుపై ప్రశ్నలు సంధించిన విజయ్‌
  • డిజిటల్‌ లైంగిక దాడితో సమానమన్న వ్యాఖ్య
ఏఐ సాంకేతికతను ఇంత దారుణంగా దుర్వినియోగం చేయడంపై నటుడు విజయ్‌ దేవరకొండ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్న ఘటనపై జూనియర్‌ ఎన్టీఆర్‌కు అతడు పూర్తి మద్దతు తెలిపారు. ఈ వీడియోను రూపొందించినవారిని, ప్రచారం చేస్తున్నవారిని అసలు వదిలిపెట్టకూడదన్నాడు. వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరాడు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ పోస్టును తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసిన విజయ్‌.. ‘‘మనం ఇంత దిగజారిపోయామా? ఒకరిపై ఒకరం ఇంత సున్నితత్వం కోల్పోయామా?’’ అని ప్రశ్నించాడు. ఇలాంటి కంటెంట్‌ను చూసి ఆనందించే స్థాయికి సమాజం ఎలా చేరిందో అర్థం కావడం లేదన్నాడు.

‘‘ఇలాంటి పిల్లలను ఎలా పెంచుతున్నారు? మనం ఎలాంటి సమాజంలో జీవిస్తున్నాం?’’ అంటూ తల్లిదండ్రుల పెంపకంపైనా విజయ్‌ ప్రశ్నలు సంధించాడు. ఒకరిని కించపరచడంలో ఆనందం పొందే పరిస్థితి రావడం బాధాకరమన్నాడు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉందని విజయ్‌ గుర్తు చేశాడు. అలాంటి సాంకేతికతను ఉపయోగించి మంచి పనులు చేయాల్సింది పోయి ఇలాంటి అర్థంలేని, నీచమైన పనులకు వాడుతున్నారని మండిపడ్డాడు.

ఇలాంటి వీడియోను తయారు చేసి బయటకు తీసుకురావడాన్ని విజయ్‌ డిజిటల్‌ లైంగిక దాడితో సమానమైన చర్యగా అభివర్ణించాడు. ఇలాంటి ఘటనలను చట్టం అత్యంత తీవ్రంగా పరిగణించాలని కోరాడు.

చివరగా ఈ వ్యవహారంపై పోరాడుతున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, అతడి బృందానికి తన పూర్తి మద్దతు ఉంటుందని విజయ్‌ స్పష్టం చేశాడు.

‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన మార్ఫింగ్‌ వీడియోపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటికే తీవ్రంగా స్పందించాడు. వీడియోను రూపొందించినవారిపై, దాన్ని ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పాడు. ఏఐ దుర్వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాడు.
Advertisement
Vijay Deverakonda
Jr NTR
Chuttamalle Morphed Video
AI Misuse
Devara Movie
Digital Sexual Abuse

More Telugu News