కరవుసీమ ఇకపై కనకసీమగా మారుతుంది: చంద్రబాబు
Advertisement

కరవుసీమ ఇకపై కనకసీమగా మారుతుంది: చంద్రబాబు

Chandrababu Naidu says drought prone Rayalaseema will become golden land
  • మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
  • సాగునీరు అందిస్తే సీమ రైతులు బంగారం పండిస్తారన్న చంద్రబాబు
  • మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వ్యాఖ్య
కరవుపీడిత రాయలసీమ తలరాతను, రూపురేఖలను మార్చేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను తీసుకొచ్చామని, ఈ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి 'రాయలసీమ హార్టికల్చర్ హబ్', 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'లకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సాగునీరు అందిస్తే సీమ రైతులు బంగారం పండిస్తారని అన్నారు. రూ. లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, కరవు సీమ ఇకపై కనకసీమగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2026 అక్టోబర్ 2వ తేదీ ఈ ప్రాంత చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అదనంగా ఆరు లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తామని, ఈ హబ్ ద్వారా పంటల ఉత్పత్తి, ధరల స్థిరీకరణ సాధ్యమవుతుందని వివరించారు.

ఎన్టీ రామారావు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళుతున్నామని, హంద్రీనీవా లేకపోతే మదనపల్లె ప్రాంతం వలసలతో ఖాళీ అయ్యేదని గుర్తుచేశారు. మూడేళ్లలో రూ.35,000 కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా ఫేజ్-2, వెలిగొండ ఫేజ్-2, మడకశిర బ్రాంచ్ కెనాల్ విస్తరణ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీని 'ఆంధ్రా బిడ్డ' అని అభివర్ణించిన చంద్రబాబు, తిరుమలకు ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సులు అందించడంపై ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, దాన్ని కూడా పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.

Advertisement
Chandrababu Naidu
Rayalaseema Horticulture Hub
Nirmala Sitharaman
Indian School of Agriculture
Madanapalle Development Projects
Anant Ambani Andhra Pradesh

More Telugu News