రోహిత్ విషయంలో అగార్కర్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

రోహిత్ విషయంలో అగార్కర్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Rohit Sharma Ajit Agarkar now regrets his stance claims former cricketer
  • రోహిత్ విషయంలో అగార్కర్ ఇప్పుడు బాధపడుతున్నాడ‌న్న సదగోపన్ రమేశ్‌
  • వరుస సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్ శర్మ
  • రోహిత్, కోహ్లీ మధ్య ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోందని వ్యాఖ్య
  • ఇంగ్లండ్ సిరీస్‌తోనే రోహిత్ కెరీర్ ముగిసిందంటూ వచ్చిన వార్తలు
  • వయసును కాదని ఫిట్‌నెస్‌తో రాణిస్తున్నాడన్న మాజీ క్రికెటర్ విశ్లేషణ
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్‌ రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతూ ఉండవచ్చని భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను జట్టులో కొనసాగించడంపై అగార్కర్ సుముఖంగా లేడని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల రోహిత్ అద్భుత ఫామ్‌తో చెలరేగడం ఈ వ్యాఖ్యలకు కారణమైంది. 

ఈ ఏడాది ఆరంభంలో భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, సెలెక్టర్లు రోహిత్ భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి వచ్చారని, ఆ సిరీసే అతడికి చివరిది కానుందని ప్రచారం జరిగింది. ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అగార్కర్, రోహిత్‌ను జట్టు నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, బీసీసీఐ ఆ వార్తలను ఖండించింది. సెలెక్టర్ల ప్రణాళికల్లో ఉన్నంత వరకు రోహిత్‌ను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఇంగ్లండ్‌పై చివరి వన్డేలో 138 పరుగులతో అద్భుత శతకం బాదిన అతను, తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు.

ఈ పరిణామాలపై సదగోపన్ రమేశ్‌ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు. "వచ్చే ఏడాది ప్రపంచకప్ జట్టులో రోహిత్ ఉండకూడదని అగార్కర్ ఒంటికాలిపై నిలబడ్డాడని వార్తలొచ్చాయి. బహుశా అందుకే అత‌ని కాంట్రాక్టును పొడిగించలేదేమో. కానీ, వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని రోహిత్ పదేపదే నిరూపిస్తున్నాడు. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి, ఆ తర్వాత సెంచరీ బాదేంతసేపు బ్యాటింగ్ చేశాడంటే అతని ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రోహిత్ విషయంలో తన వైఖరిని చూసి అగార్కర్ ఇప్పుడు కచ్చితంగా పశ్చాత్తాపపడుతుంటాడు" అని రమేశ్‌ విశ్లేషించాడు.

అంతేగాక ఇద్దరు వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నడుస్తోందని రమేశ్‌ అన్నాడు. "ఒకరు సెంచరీ చేస్తే, మరొకరు కూడా సెంచరీ చేయడం ఇప్పుడు ఒక ఆనవాయితీగా మారింది. ఇద్దరూ గాయపడిన పులుల్లా ఆడుతున్నారు. ఇలాంటి ఫ్లాట్ పిచ్‌పై రోహిత్ సెంచరీ చేయడం ఆశ్చర్యం కలిగించలేదు. అతను తీవ్రమైన కసితో బ్యాటింగ్ చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది" అని పేర్కొన్నాడు.
Advertisement
Rohit Sharma
Ajit Agarkar
Sadagoppan Ramesh
BCCI
Team India
Indian Cricket Team

More Telugu News