క్యాంపస్‌ హైరింగ్‌కు ఢోకా లేదు.. జీతాలు 7 శాతం వరకు పెరిగే ఛాన్స్‌!
Advertisement

క్యాంపస్‌ హైరింగ్‌కు ఢోకా లేదు.. జీతాలు 7 శాతం వరకు పెరిగే ఛాన్స్‌!

Campus hiring remains stable and salaries likely to increase up to 7 percent
  • క్యాంపస్‌ జీతాలు 2-7 శాతం పెరిగే అవకాశం ఉందన్న ఎయాన్‌
  • సీఏ, సీఎస్‌ గ్రాడ్యుయేట్లపై 56 శాతం సంస్థల ఆసక్తి
  • 51 శాతం సంస్థలు పెంచనున్న ఇంటర్న్‌ల నియామకాలు
  • డిప్లొమా హోల్డర్ల నియామకాలు పెంచే యోచన
  • ఇంజినీర్ల నియామకాలు పెంచనున్న 36 శాతం సంస్థలు
దేశంలో క్యాంపస్‌ నియామకాల మార్కెట్‌ స్థిరంగా కొనసాగుతోంది. నైపుణ్యాలు, కీలక ఉద్యోగాలు, ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో క్యాంపస్‌ నియామకాల్లో మధ్యస్థ జీతాలు ఏడాదికి 2 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ సంస్థ ‘ఎయాన్‌’ నివేదిక తెలిపింది.

వివిధ విద్యార్హతలు ఉన్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్‌) కోర్సులు పూర్తి చేసిన వారిని ఎక్కువగా నియమించుకోవాలని 56 శాతం సంస్థలు భావిస్తున్నాయి. 51 శాతం సంస్థలు ఇంటర్న్‌ల నియామకాలను పెంచాలని చూస్తున్నాయి. 40 శాతం సంస్థలు డిప్లొమా విద్యార్థులను, 36 శాతం సంస్థలు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఎక్కువగా తీసుకునే ఆలోచనలో ఉన్నాయి. అయితే, కొన్ని కేటగిరీల్లో నియామకాల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించడం లేదని నివేదిక తెలిపింది.

బీటెక్‌ 2027 బ్యాచ్‌కు సంబంధించి ఏడు ఐఐటీల్లో మధ్యస్థ (టోటల్‌ కాస్ట్‌ టు కంపెనీ) టీసీసీ రూ.16.46 లక్షల వద్దే ఉండే అవకాశం ఉంది. టైర్‌-1 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇది రూ.13.85 లక్షల నుంచి రూ.14.75 లక్షలకు పెరగొచ్చు. ఎంబీఏ విద్యార్థులకు టాప్‌ ఐఐఎంలలో మధ్యస్థ టీసీసీ రూ.26 లక్షలుగా ఉండొచ్చని అంచనా. టైర్‌-1 మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో రూ.20.89 లక్షల నుంచి రూ.21.50 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.

టీసీసీలో స్థిర వేతనం, జాయినింగ్‌ బోనస్‌ వంటి వన్‌టైమ్‌ నగదు ప్రయోజనాలు, వార్షిక వేరియబుల్‌ పే ఉంటాయి. లాంగ్‌టర్మ్‌ ఇన్సెంటివ్‌లు ఇందులో ఉండవు.

సుమారు 90 శాతం సంస్థలు ఇంటర్న్‌లను నియమించుకుంటున్నాయి. 80-85 శాతం సంస్థలు ప్రతిభ చూపిన ఇంటర్న్‌లను పూర్తిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలు లేదా ఆఫర్లను వినియోగిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో నైపుణ్యాలు, ఉద్యోగానికి సరిపోయే సామర్థ్యంపై ఏఐ కూడా ఎక్కువగా దృష్టి పెట్టేలా చేస్తోందని ఎయాన్‌ తెలిపింది.

క్యాంపస్‌ నియామకాల్లో ఆఫర్‌-టు-జాయినింగ్‌ నిష్పత్తిని 66 శాతం సంస్థలు పరిశీలిస్తున్నాయి. తొలి ఏడాది పనితీరు రేటింగ్‌, ప్రారంభ దశలో ఉద్యోగం వదిలివెళ్లే వారి సంఖ్యను చెరో 55 శాతం సంస్థలు గమనిస్తున్నాయి.
Advertisement
Aon
Campus Hiring India
Salary Hike 2024
IIT IIM Placements
Graduate Recruitment Trends
Job Market India

More Telugu News