చిన్న పెట్రోల్‌ కార్లకు షాక్‌.. ఈవీలకు మాత్రం భారీ ప్రోత్సాహం
Advertisement

చిన్న పెట్రోల్‌ కార్లకు షాక్‌.. ఈవీలకు మాత్రం భారీ ప్రోత్సాహం

New rules for car companies and massive boost for EVs
  • కేఫ్‌-3 నిబంధనలు 2027 ఏప్రిల్‌ నుంచి అమలు
  • 2032 మార్చి వరకు కొత్త నిబంధనలు కొనసాగింపు
  • చిన్న పెట్రోల్‌ కార్లకు ప్రత్యేక రాయితీ తొలగింపు
  • వాహన బరువుపై ఆధారిత ఉద్గారాల ఫార్ములాలో మార్పులు
  • ఒక ఈవీని మూడు వాహనాలుగా లెక్కించే అవకాశం
కార్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ‘కార్పొరేట్‌ యావరేజ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ’ (CAFE-3) నిబంధనలను ప్రకటించింది. 2027 ఏప్రిల్‌ నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. 2032 మార్చి వరకు కొనసాగుతాయి. చిన్న పెట్రోల్‌ కార్లకు ప్రత్యేకంగా ఇవ్వాలని గతంలో ప్రతిపాదించిన రాయితీని తుది నిబంధనల్లో తొలగించారు. అదే సమయంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు అందుతున్న ప్రోత్సాహకాలను కొనసాగించారు.

చిన్న కార్లకు ప్రత్యేక రాయితీ లేదు
909 కిలోల వరకు బరువున్న పెట్రోల్‌ కార్లకు కిలోమీటరుకు 3 గ్రాముల కార్బన్‌ ఉద్గార రాయితీ ఇవ్వాలని 2025లో రూపొందించిన ముసాయిదాలో ప్రతిపాదించారు. దీనిని పలు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వ్యతిరేకించాయి. తుది నిబంధనల్లో ఈ ప్రత్యేక రాయితీకి చోటు కల్పించలేదు. బదులుగా కంపెనీ మొత్తం కార్ల ఉద్గారాల లక్ష్యాన్ని నిర్ణయించే ఫార్ములాను మార్చారు.

భారీ కార్లకు కఠిన లక్ష్యాలు
వాహనాల సగటు బరువుకు సంబంధించిన ప్రామాణిక పరిమితిని 1,170 కిలోల నుంచి 1,229 కిలోలకు పెంచారు. వార్షిక బరువు సర్దుబాటు రేటును కూడా తగ్గించారు. దీంతో తక్కువ బరువున్న కార్ల ఫ్లీట్లకు కొంత వెసులుబాటు లభిస్తుంది. భారీ వాహనాలకు మాత్రం ఉద్గారాల లక్ష్యాలు మరింత కఠినంగా మారతాయి. ఉదాహరణకు 909 కిలోల కారు 2027-28లో కిలోమీటరుకు సుమారు 82.8 గ్రాముల కార్బన్‌డయాక్సైడ్‌ ఉద్గారాల పరిమితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈవీకి 3 కార్ల లెక్క
శుభ్రమైన వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ‘సూపర్‌ క్రెడిట్‌’ విధానాన్ని కొనసాగించారు. ఒక బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కంపెనీ ఫ్లీట్‌ పనితీరు లెక్కలో మూడు వాహనాలుగా పరిగణిస్తారు. రేంజ్‌ ఎక్స్‌టెండెడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకూ ఇదే 3 రెట్ల లెక్క వర్తిస్తుంది. ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌, ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్లకు 2.5 రెట్లు, స్ట్రాంగ్‌ హైబ్రిడ్లకు 1.6 రెట్లు, ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ వాహనాలకు 1.1 రెట్ల క్రెడిట్‌ లభిస్తుంది.

క్రెడిట్‌.. డెబిట్‌ విధానం
కొత్త నిబంధనల్లో క్రెడిట్‌-డెబిట్‌ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. నిర్దేశించిన ఉద్గారాల లక్ష్యం కంటే మెరుగైన పనితీరు చూపిన కంపెనీలకు క్రెడిట్లు లభిస్తాయి. లక్ష్యాలను అందుకోలేని సంస్థలకు డెబిట్లు పేరుకుపోతాయి.
Advertisement
CAFE 3 Norms
Electric Vehicles
Car Manufacturing
Emission Standards
Indian Automobile Industry
EV Super Credits

More Telugu News