మహిళలకు ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం: చంద్రబాబు
Advertisement

మహిళలకు ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం: చంద్రబాబు

Chandrababu Naidu announces free AC bus travel for women
  • విజయవాడలో 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమం
  • 120 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం చూపినట్లు తెలిపిన సీఎం
  • రాష్ట్రవ్యాప్తంగా 26,401 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
తమ ప్రభుత్వం 120 ఏళ్ల నాటి ఇళ్ల స్థలాల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని మకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో ఆయన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సొంత ఇల్లు అనేది పేదల జీవితకాల స్వప్నమని, దీని కోసం 40 నుంచి 50 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 26,401 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో లబ్ధిదారులకు సగటున 130 గజాల స్థలానికి పట్టాలు అందించినట్లు చెప్పారు. ఇది పేదల ఆత్మగౌరవానికి కట్టబెట్టిన పట్టాభిషేకమని, వారి చిరకాల వాంఛను నెరవేర్చామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు జెట్ స్పీడ్‌తో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ప్రతీ పేదవాడికి న్యాయం చేసేందుకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు విశాఖ, మంగళగిరి, విజయవాడ కార్యక్రమాలతో కలిపి సుమారు 60,000 పట్టాలు పంపిణీ చేశామని, వాటి విలువ సుమారు రూ.52,000 కోట్లు ఉంటుందని వివరించారు. లబ్ధిదారులు ఈ ఆస్తిని అమ్ముకోవద్దని, భవిష్యత్ కోసం కాపాడుకోవాలని సూచించారు.

మహిళల కోసం 'స్త్రీ శక్తి' పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో ఏసీ బస్సులను కూడా కొనుగోలు చేసి వాటిలోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 
Advertisement
Nara Chandrababu Naidu
Andhra Pradesh House Site Pattas
Free AC Bus Travel Women
Vijayawada Pedalaku Pattabhishekam
Stree Shakti Scheme
AP Housing Scheme

More Telugu News