కన్నడలో కిచ్చా సుదీప్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా రూపొందిన ఆ సినిమా పేరే 'మ్యాంగో పచ్చ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి వివేక దర్శకత్వం వహించాడు. కాజల్ కుందర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, జూన్ 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 25వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు, తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

మైసూర్ లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అడ్డాగా 'మహేందర్' సామ్రాజ్యం ఉంటుంది. పద్మ భర్త ఆయన దగ్గర పనిచేస్తుంటాడు.. వాళ్లకి ముగ్గురు పిల్లలు ఉంటారు. వాళ్లలో పెద్దవాడు 'నాగప్ప' .. రెండోవాడు 'ప్రశాంత్' .. మూడోవాడు 'శ్యామ్'. తండ్రి చనిపోవడంతో అతని స్థానంలో మహేందర్ దగ్గర నాగప్ప పనిచేస్తూ ఉంటాడు. ప్రశాంత్ లోని ధైర్యసాహసాలు .. అతని తెగింపు గురించి మహేందర్ కి తెలుసు. అందువలన ఈ అక్రమ వ్యాపారంలోకి అతనిని దింపితే బాగుంటుందని నాగప్పను మహేంద్ర ఒత్తిడి చేస్తాడు.

ప్రశాంత్ డీవీడీ షాప్ నడుపుతూ .. పైరసీ కేసెట్లు అమ్ముతూ వెళుతుంటాడు. అతను 'సుజీ' అనే యువతిని లవ్ చేస్తూ ఉంటాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మహేందర్ - నాగప్ప గంజాయిని పండించడంలో .. సప్లై చేసే విషయంలోను ప్రశాంత్ ను ఒప్పిస్తారు. ప్రశాంత్ దగ్గరే శ్యామ్ కూడా పనిచేస్తూ ఉంటాడు. గంజాయి వ్యాపారంలో ప్రశాంత్ చాలా వేగంగా దూసుకుపోతాడు. నమ్మకమైన కుర్రాళ్లను పనిలో పెట్టుకుని, గంజాయి వ్యాపారాన్ని నగరంలో విస్తరింపజేస్తాడు.

ఒక వైపున నాగప్ప రాజకీయాలలో ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరో వైపున మహేందర్ ప్రమేయం లేకుండా ప్రశాంత్ సొంతంగా దందాను మొదలుపెడతాడు. అందరూ అతనిని 'మ్యాంగో పచ్చ' అనే పేరుతో పిలుస్తుంటారు. కుటుంబం పరంగా .. వ్యాపారం పరంగా మ్యాంగో పచ్చను దెబ్బకొట్టాలని మహేందర్ నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఫలితంగా మ్యాంగో పచ్చకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనేది మిగతా కథ. 

మైసూరు నేపథ్యంలో జరిగే మాదక ద్రవ్యాల రవాణా .. అక్కడి ముఠాల మధ్య జరిగే ఆధిపత్య పోరు చుట్టూ అల్లుకున్న కథ ఇది. రౌడీయిజం తెలిస్తే మాఫియాలోకి ఎంట్రీ లభించినట్టే. మాఫియాలో ఉంటే డబ్బులు సంపాదించవచ్చు .. రాజకీయాలలోకి వెళ్లొచ్చు .. అధికారులను అదుపు చేయవచ్చు .. అవతలివారి నుంచి భయంతో కూడిన మర్యాదలను పొందచ్చని భావించిన ఒక యువకుడి కథగా 'మ్యాంగో పచ్చ' కనిపిస్తుంది. 

ఒక డీవీడీ షాప్ నడుపుకునే యువకుడు, తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా ఉంటాడు. అలాంటి అతను తన అన్నయ్య మాటలు నమ్మి మాఫియా వైపు వెళతాడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దిశగా అడుగులు వేస్తాడు. అందుకు సంబంధించిన సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక ఆ యువకుడు మాఫియాలో సొంతగా ఎదగడానికి ప్రయత్నించాలనే ఆలోచన చేసిన దగ్గర నుంచి సెకండాఫ్ మొదలవుతుంది.

హీరో లోకల్ గా ఉన్న మాఫియా డాన్ ను ఆశ్రయించడం .. ఆ తరువాత అతనిని మించి ఎదగడం .. అసూయతో అతను పగబట్టడం .. హీరో బలహీనతలు తెలుసుకుని దెబ్బతీయడానికి ప్రయత్నించడం వంటి కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అదే తరహాలో సాగే కథ ఇది. ఇద్దరి మధ్య ఎత్తులు పయ్యెత్తులు ఏమైనా ఉన్నాయంటే అవీ లేవు. మాదక ద్రవ్యాలు పట్టుబడకుండా సప్లై చేయడంలో హీరో తన తెలివి తేటలు ఏమైనా ఉపయోగించాడా అంటే అదీ లేదు.

ఇక హీరో వర్గం నివసిస్తున్న బస్తీని ఖాళీ చేయించడానికి విలన్ ప్రయత్నించడం, అందుకు వ్యతిరేకంగా హీరో రియాక్ట్ కావడం .. బస్తీ వాసులకు భరోసా ఇవ్వడం తరహా సన్నివేశాలు 1980లలో వచ్చిన సినిమాలలో చూసేసి ఉన్నారు. అందువలన ఆడియన్స్ ఇప్పుడు కొత్తగా ఫీలయ్యేదేం ఉండదు. ఇంత జరుగుతున్నా కనిపించే పోలీసుల హడావిడి అంతంత మాత్రం. ఇలా ఈ సినిమా సాదాసీదా సన్నివేశాలతోనే సాగుతుంది.    

తల్లీ కొడుకుల ఎమోషన్స్ .. అన్నదమ్ముల ఎమోషన్స్ టచ్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కానీ ఎందుకనో ఆ అంశాలను బలంగా అల్లుకోలేకపోయాడు. ఇక హీరో అన్నయ్య నాగప్ప పాత్ర అయోమయంలో పడేస్తుంది. అతను హీరో వైపా .. విలన్ వైపా అనే విషయంలో ఆడియన్స్ కి చివరి వరకూ క్లారిటీ రాదు. ఇక హీరో లవ్ ట్రాక్ కూడా బలహీనంగా అనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక రోటీన్ స్టోరీ. 

హీరోకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ బాగానే చేశాడు. హీరోయిన్ పాత్రకి అంతగా ప్రాముఖ్యత లేదు. విలన్ పాత్రను డిజైన్ చేసిన తీరు పరమ రొటీన్ గా అనిపిస్తుంది. ఎమోషన్స్ కనెక్ట్ కానీ కారణంగా, యాక్షన్ దృశ్యాలు కూడా చాలా మొక్కుబడిగా అనిపిస్తాయి. ఏ మాత్రం కొత్తదనం లేని .. ఏ వైపు నుంచి ఆకట్టుకోని కంటెంట్ గానే ఈ సినిమాను గురించి చెప్పుకోవలసి ఉంటుంది.