డెల్టా సీఈవోపై మస్క్ ఫైర్.. మీ ఉద్యోగం ఊడుతుంది జాగ్ర‌త్త అంటూ వార్నింగ్!
Advertisement

డెల్టా సీఈవోపై మస్క్ ఫైర్.. మీ ఉద్యోగం ఊడుతుంది జాగ్ర‌త్త అంటూ వార్నింగ్!

Elon Musk slams Delta CEO Ed Bastian over Amazon WiFi deal
  • స్టార్‌లింక్‌ను తిరస్కరించిన డెల్టా ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డ మస్క్
  • మస్క్ ప్రతిష్ఠ‌పై సీఈవో ఎడ్ బాస్టియన్ చేసిన వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం
  • ఈ నిర్ణయం వల్ల మీ ఉద్యోగం పోవడం ఖాయమంటూ సీఈవోకు మస్క్ వార్నింగ్‌
  • స్టార్‌లింక్‌ను కాదని అమెజాన్ 'లియో' వైఫై కోసం డెల్టా ఒప్పందం
  • ఇది కేవలం వైఫై డీల్ కాదని, అమెజాన్‌తో తమకు విస్తృత భాగస్వామ్యం ఉందన్న‌ డెల్టా
ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తమ విమానాల్లో వైఫై సేవల కోసం మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ను కాదని, అమెజాన్‌కు చెందిన 'లియో' శాటిలైట్ వ్యవస్థను ఎంచుకోవడంపై మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు డెల్టా సీఈవో ఎడ్ బాస్టియన్ తన ఉద్యోగాన్ని కోల్పోతారని హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.

ఈ వివాదానికి అసలు కారణం డెల్టా సీఈవో ఎడ్ బాస్టియన్, మస్క్ ప్రతిష్టపై చేసినట్లుగా చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు. ఒక కంపెనీ కార్యక్రమంలో ఉద్యోగులతో మాట్లాడుతూ.. మస్క్‌తో కలిసి పనిచేయడానికి తాము ఇష్టపడలేదని బాస్టియన్ అన్నట్లు ఏవియేషన్ రిపోర్టర్ ఒకరు వెల్లడించారు. 

"మస్క్ ప్రతిష్ఠ‌ గురించి మీకు తెలిస్తే, ఆయన గురించి బయట చెప్పేవన్నీ నిజాలే" అని బాస్టియన్ వ్యాఖ్యానించినట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మస్క్ దృష్టికి వెళ్లాయి. దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. 

'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "ఈ నిర్ణయం వల్ల బాస్టియన్ తన ఉద్యోగాన్ని కోల్పోతారు" అని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా డెల్టా కనెక్టివిటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

స్టార్‌లింక్ కనెక్టివిటీ లేనందున, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేయాలంటే దాన్ని డెల్టా విమానంలో ఉంచడమే సరైన మార్గమని చురక అంటించారు. ఈ నిర్ణయం వల్ల డెల్టా గణనీయమైన సంఖ్యలో కస్టమర్లను కోల్పోవచ్చని ఆయన గతంలోనే హెచ్చరించారు.

గత మార్చి నెలలో డెల్టా ఎయిర్‌లైన్స్, అమెజాన్‌తో బహుళ-సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 2028 నుంచి దశలవారీగా 500 విమానాల్లో అమెజాన్ 'లియో' శాటిలైట్ ఆధారిత వైఫై సేవలను ప్రారంభించనుంది. అయితే, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి అనేక ప్రత్యర్థి సంస్థలు ఇప్పటికే తమ విమానాల్లో వేగవంతమైన స్టార్‌లింక్ సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

అయితే, తమ నిర్ణయాన్ని డెల్టా సమర్థించుకుంటోంది. ఇది కేవలం వైఫై ఒప్పందం మాత్రమే కాదని, అమెజాన్‌తో తమకున్న విస్తృత భాగస్వామ్యంలో భాగమని స్పష్టం చేసింది. డెల్టా ఇప్పటికే తమ 600 అప్లికేషన్ల కోసం 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' (ఏడ‌బ్ల్యూఎస్‌)ను వినియోగిస్తోంది. 

భవిష్యత్తులో అమెజాన్ క్లౌడ్, రిటైలింగ్, ప్రైమ్ వీడియో, గేమింగ్ టెక్నాలజీ వంటి సేవలను కూడా ప్రయాణికులకు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని వివరిస్తోంది.

అయినప్పటికీ, డెల్టా నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. మస్క్ స్టార్‌లింక్ ఇప్పటికే వేలాది శాటిలైట్లతో పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ను కలిగి ఉండగా, అమెజాన్ 'లియో' ప్రాజెక్ట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. స్టార్‌లింక్‌తో పోలిస్తే అమెజాన్ శాటిలైట్ల సంఖ్య చాలా తక్కువ. 

ఈ నేపథ్యంలో నిరూపితమైన టెక్నాలజీని కాదని, ఇంకా అభివృద్ధి దశలో ఉన్న వ్యవస్థను ఎంచుకోవడం సరైన వ్యూహం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, అమెజాన్‌తో భాగస్వామ్యం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని డెల్టా ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ టెక్ యుద్ధంలో ఎవరి వ్యూహం ఫలిస్తుందో కాలమే నిర్ణయించాలి.
Advertisement
Elon Musk
Delta Air Lines
Ed Bastian
Starlink
Amazon LEO
Inflight WiFi

More Telugu News