ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నజరానా
- 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే రేసులో భారత్‌కు రజత పతకం
- జట్టులో తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్
- చెరో రూ. 50 లక్షల నజరానా ప్రకటించిన సీఎం
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి, తమిళనాడు రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన అథ్లెట్లకు ముఖ్యమంత్రి విజయ్ భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే రేసులో భారత్‌కు రజత పతకం అందించిన జట్టులోని తమిళనాడు అథ్లెట్లు విద్య రామరాజ్, విశాల్‌లకు చెరో రూ. 50 లక్షల నజరానా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. వీరికి తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (SDAT)కి చెందిన ‘ఎలైట్ స్పోర్ట్స్‌పర్సన్ స్కీమ్’ కింద ఈ ఆర్థిక సాయం అందనుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టులోని తమిళనాడు యువ క్రీడాకారిణి జి. కమలినికి విజయ్ రూ. 75 లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.
"4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రజత పతకం సాధించిన భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు. నలుగురు సభ్యులున్న భారత జట్టులో ఇద్దరు తమిళనాడుకు చెందిన క్రీడాకారులు ఉండటం మన రాష్ట్ర క్రీడా రంగానికి గర్వకారణం. విద్య రామరాజ్, విశాల్ సాధించిన ఈ విజయం క్రీడల్లో రాణించాలనుకునే యువతకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్‌లో వీరిద్దరూ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి తమిళనాడుతో పాటు భారత్‌కు మంచి పేరు తీసుకురావాలి" అని సీఎం విజయ్ ప్రశంసించారు.
4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలే విభాగంలో విద్య రామరాజ్, విశాల్, మను, పూవమ్మలతో కూడిన భారత బృందం 3:14.46 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతాన్ని కైవసం చేసుకుంది. బహ్రెయిన్ జట్టు 3:12.87 సెకన్ల టైమింగ్‌తో గేమ్స్ రికార్డు నమోదు చేస్తూ స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల మిక్స్‌డ్ రిలే విభాగంలో భారత్‌కు ఇది వరుసగా మూడో పతకం కావడం విశేషం. 2018లో స్వర్ణం, 2022లో రజతం గెలిచిన భారత జట్టు, మరోసారి రజత పతకంతో మెరిసింది.