టోరెంట్, వెల్స్‌పన్, ఆస్ట్రల్.. అహ్మదాబాద్‌లో రెండో రోజు కూడా నారా లోకేశ్ బిజీబిజీ

టోరెంట్, వెల్స్‌పన్, ఆస్ట్రల్.. అహ్మదాబాద్‌లో రెండో రోజు కూడా నారా లోకేశ్ బిజీబిజీ

Nara Lokesh Second Day Tour Of Ahmedabad
  • అహ్మదాబాద్ పర్యటనలో పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి లోకేశ్ వరుస సమావేశాలు
  • క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఏపీని ఎంచుకోవాలని టోరెంట్ గ్రూప్‌కు పిలుపు
  • విశాఖలో టైర్ల తయారీ, డేటా సెంటర్ల ఏర్పాటుపై పలు సంస్థలతో కీలక చర్చలు
  • కాకినాడ, నెల్లూరులలో ఇండస్ట్రియల్ పార్కులు, రిఫైనరీలు స్థాపించాలని విజ్ఞప్తి
  • లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించిన కంపెనీలు
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ విస్తృత పర్యటనలు కొనసాగిస్తున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ టూర్‌లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఆయన పలు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఏడు ప్రముఖ సంస్థల అధిపతులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు. క్లీన్ ఎనర్జీ, ఫార్మా, టెక్స్‌టైల్స్, మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, తయారీ వంటి కీలక రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలియజేసి, పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. లోకేశ్ ప్రతిపాదనలపై కంపెనీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి, వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

క్లీన్ ఎనర్జీలో ఏపీని ఎంచుకోండి: టోరెంట్ గ్రూప్‌తో లోకేశ్
ఫార్మా, పవర్ రంగాల్లో అగ్రగామిగా ఉన్న టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతా, ఇతర డైరక్టర్లతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఫార్మా క్లస్టర్లలో ఏపీఐ, ఇంటర్మీడియట్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని కోరారు. ముఖ్యంగా, పునరుత్పాదక ఇంధన రంగంలో టోరెంట్ గ్రూప్ ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఏపీ అనువైనదని తెలిపారు. పంప్డ్-స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సమీర్ మెహతా స్పందిస్తూ.. 2030 నాటికి 10 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడమే తమ లక్ష్యమని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పక పరిశీలిస్తామని చెప్పారు.

కాకినాడలో ఇండస్ట్రియల్ పార్క్: వెల్స్‌పన్ గ్రూప్‌కు ప్రతిపాదన
టెక్స్‌టైల్స్, మౌలిక సదుపాయాల రంగంలో ప్రసిద్ధిగాంచిన వెల్స్‌పన్ వరల్డ్ గ్రూప్ సీఈఓ నితిన్ జైన్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. గతంలో దావోస్‌లో సీఎం చంద్రబాబుతో జరిగిన చర్చల పురోగతిని సమీక్షించారు. విశాఖపట్నంలో వెల్స్‌పన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. కాకినాడలో టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, పైపుల తయారీ, గ్రీన్ అమ్మోనియా యూనిట్లతో కూడిన ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. నితిన్ జైన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కర్నూలు, కడపలో తమ సంస్థ 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, తాజా ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తామని తెలిపారు.

నెల్లూరులో ఆయిల్ రిఫైనరీలు: గోకుల్ ఆగ్రోతో చర్చలు
వంట నూనెల తయారీలో పేరొందిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ చైర్మన్ కనుభాయ్ ఠక్కర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌కు అదనంగా పామాయిల్, సోయాబీన్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై కనుభాయ్ ఠక్కర్ స్పందిస్తూ.. కృష్ణపట్నంలో తమ ప్లాంట్ 2024 నుంచి ఉత్పత్తి ప్రారంభించిందని, దక్షిణాది మార్కెట్ల కోసం విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విశాఖలో టైర్ల తయారీ యూనిట్: చిరిపాల్ గ్రూప్‌కు ఆహ్వానం
టెక్స్‌టైల్స్, కెమికల్స్ రంగాల్లోని చిరిపాల్ గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ బ్రిజ్ మోహన్ చిరిపాల్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విశాఖపట్నం కనెక్టివిటీ, మౌలిక వసతులను వివరిస్తూ.. అక్కడ గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై బ్రిజ్ మోహన్ చిరిపాల్ స్పందిస్తూ.. ప్రస్తుతం తమకు పలు రాష్ట్రాల్లో తయారీ యూనిట్లు ఉన్నాయని, టైర్ల తయారీకి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని అన్నారు.

డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి: ఎస్టీ టెలీమీడియాతో లోకేశ్
డేటా సెంటర్ల దిగ్గజం ఎస్టీ టెలీమీడియా వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ జెనాతో లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖపట్నం డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతోందని, ఇప్పటికే గూగుల్, రిలయన్స్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనిపై గౌతమ్ జెనా స్పందిస్తూ.. తమ సంస్థ కార్యకలాపాలను వివరించి, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు.

విశాఖలో ప్రీ ఫ్యాబ్ కేంద్రం: ఈప్యాక్ గ్రూప్‌తో భేటీ
ప్రీ ఫ్యాబ్ నిర్మాణ రంగంలో పేరొందిన ఈప్యాక్ గ్రూప్ చైర్మన్ భజరంగ్ బోత్రాతో లోకేశ్ సమావేశమయ్యారు. డేటా సెంటర్ల నిర్మాణానికి అవసరమైన ప్రీ ఫ్యాబ్ నిర్మాణ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని కోరారు. భజరంగ్ బోత్రా మాట్లాడుతూ.. ఇప్పటికే శ్రీసిటీలో తమకు తయారీ యూనిట్లు ఉన్నాయని, విశాఖ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని తెలిపారు.

పైపుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయండి: ఆస్ట్రల్ పైప్స్‌తో సమావేశం
పైపుల తయారీలో అగ్రగామిగా ఉన్న ఆస్ట్రల్ పైప్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అల్కేష్ పంచల్‌తో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, కాకినాడ లేదా అనకాపల్లిలో పైపుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. అల్కేష్ పంచల్ స్పందిస్తూ.. తమకు దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్ ఉందని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Investments
Ahmedabad Business Meet
Torrent Welspun Astral
AP IT Minister Gujarat Tour
Industrial Development Andhra Pradesh

More Telugu News