ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే పోటీ చేయడం ఎందుకు? విపక్షాలకు అభిజీత్ దీప్కే సూటి ప్రశ్న

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగితే పోటీ చేయడం ఎందుకు? విపక్షాలకు అభిజీత్ దీప్కే సూటి ప్రశ్న

Why contest elections if rigging happens Abhijit Dipke asks opposition parties
  • ఎన్నికల ప్రక్రియ రిగ్గింగ్ అని నమ్మితే విపక్షాలు పోటీ చేయడం ఆపేయాలన్న దీప్కే
  • ఇదొక ఫిక్స్డ్ మ్యాచ్ లాంటిదని అంటున్న సీజేపీ వ్యవస్థాపకుడు
  • సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
  • లేదంటే అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త ఆందోళనలకు హెచ్చరిక
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని గట్టిగా విశ్వసిస్తే, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడం మానుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సూచించారు. ఒకవైపు రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తూనే, మరోవైపు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఆ ప్రక్రియకు ప్రతిపక్షాలే చట్టబద్ధత కల్పిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుత పరిస్థితులను ఒక "ఫిక్స్డ్ మ్యాచ్"తో పోల్చిన అభిజీత్ దీప్కే... ప్రతిపక్షాలకు అప్పుడప్పుడు, గెలిచే కొన్ని స్థానాలను ఎరగా వేసి, ఎన్నికల్లో నిజమైన పోటీ జరుగుతోందన్న భ్రమను కల్పిస్తున్నారని విమర్శించారు.

 "ఓట్ల చౌర్యం, ప్రజాప్రతినిధుల కొనుగోలు, పార్టీల చీలికలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు? మీరు ఏ రకమైన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు?" అని ఆయన ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. రాజకీయ మనుగడ కంటే ప్రజాస్వామ్య విలువలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన హితవు పలికారు.

మరోవైపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వచ్చే 24 నుంచి 48 గంటల్లోగా తన పదవికి రాజీనామా చేయాలని దీప్కే డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన వైదొలగకపోతే, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ముంబై కేంద్రంగా దేశవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఉద్యమానికి "జంతర్ మంతర్ 2.0" అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు వార్తలు రావడం, సీఈసీపై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో దీప్కే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Advertisement
Abhijit Dipke
Cockroach Janata Party
CEC Gyanesh Kumar
Election Rigging Allegations

More Telugu News