అమెరికా దాడి చేస్తుందేమోనని ముందే సిద్ధమయ్యాం.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

అమెరికా దాడి చేస్తుందేమోనని ముందే సిద్ధమయ్యాం.. కెనడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

  • ట్రంప్‌ 51వ రాష్ట్రం వ్యాఖ్యలే కారణమన్న ప్రధాని కార్నీ
  • దాడి జరిగే అవకాశం లేదని కార్నీ స్పష్టీకరణ
  • అయినా అత్యంత అరుదైన, తీవ్రమైన పరిస్థితులకూ సిద్ధమైనట్లు వెల్లడి
  • అమెరికాతో ముదిరిన వాణిజ్య వివాదాలు
  • ఇతర దేశాలతో భాగస్వామ్యాలను పరిశీలిస్తున్నామన్న కార్నీ
అమెరికా తమ దేశంపై దాడి చేసే అవకాశాన్ని కూడా కెనడా ప్రభుత్వం పరిశీలించిందట. ఈ విషయాన్ని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ స్వయంగా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చాలంటూ పదేపదే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై కెనడా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.

అయితే అమెరికా దాడి చేసే అవకాశం ఉందని తాము భావించడం లేదని కార్నీ స్పష్టం చేశారు. అత్యంత అరుదైన, తీవ్రమైన పరిస్థితులను కూడా పరిశీలించడం ప్రధాని బాధ్యత అని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలను పట్టించుకోకుండా ఉండటం బాధ్యతారాహిత్యమే అవుతుందని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అమెరికా, కెనడా మధ్య గతేడాది నుంచి వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం భారీ సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా కెనడా కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించింది.

అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల కెనడాకు ఇబ్బందులు వస్తున్నాయని కార్నీ చెబుతున్నారు. అందుకే అమెరికా వెలుపల కొత్త వాణిజ్య భాగస్వాములను వెతుకుతున్నామని తెలిపారు.

ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌తో కెనడా సన్నిహిత సంబంధాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈయూలో కెనడా అసోసియేట్‌ సభ్యత్వం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారంపై ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు. అలా జరిగితే అది శత్రుత్వ చర్యగా భావించి యూరప్‌పై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.

కెనడా అమెరికాలో కలిసిపోవాలన్న ప్రతిపాదనను కార్నీ తిరస్కరించారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను వివిధ దేశాలతో అనుసంధానం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
Advertisement

More Telugu News