విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిపై మంత్రి నారా లోకేశ్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిపై మంత్రి నారా లోకేశ్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు

Nara Lokesh focuses on student mental stress and issues key orders to officials
  • రాష్ట్రవ్యాప్తంగా 963 పాఠశాలల్లో హార్ట్‌ఫుల్ యోగా శిక్షణకు చర్యలు
  • టెన్త్, ఇంటర్‌లో 90% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలి
  • పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి 90 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
  • ఉద్యోగ మేళాల నిర్వహణలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలి
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి, విద్యావ్యవస్థలో మెరుగైన ఫలితాలు సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, పాఠశాలల్లో యోగా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల బలోపేతం వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్.. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణకు మిషన్ మోడ్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దీనికోసం అవగాహన, సంస్థాగత మద్దతు, మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ, విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం 'కేర్ ఏపీ' అనే టూల్‌ను సిద్ధం చేశామని, పైలట్ ప్రాజెక్టు కూడా పూర్తయిందని వివరించారు. 

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా 963 ప్రభుత్వ పాఠశాలల్లో 4.47 లక్షల మంది విద్యార్థులకు 'హార్ట్‌ఫుల్ యోగా' శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనం సంస్థ ద్వారా 2,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించనున్నామని, ఈ ఏడాది హైబ్రిడ్ పద్ధతిలో, వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో యోగా తరగతులు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

పాఠశాల విద్యలో సంస్కరణల దశ ముగిసిందని, ఇకపై అధికారులంతా ఫలితాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని లోకేశ్ స్పష్టం చేశారు. టెన్త్, ఇంటర్మీడియట్‌లో 90 శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 'మిషన్ మార్చ్' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న అధికారులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. 

బోధనలో వెనుకబడిన ఉపాధ్యాయులకు మెంటార్ టీచర్లతో శిక్షణ తప్పనిసరి చేయాలన్నారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతం పెంచేందుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) అమలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమైన 'అక్షర ఆంధ్ర' ద్వారా వచ్చే ఏడాది చివరికల్లా నూరు శాతం అక్షరాస్యత సాధించాలని కోరారు.

నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన మంత్రి, పీఎం సేతు పథకం కింద పారిశ్రామికవేత్తల సహకారంతో తొలి విడతగా 10 పారిశ్రామిక అనుసంధానిత ఐటీఐ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. స్టీల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఆక్వా, ఫార్మా రంగాల సంస్థలతో సంప్రదించి 90 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. 

గత రెండేళ్లలో జాబ్ మేళాల ద్వారా 1.72 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, మొత్తం 5.43 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని అధికారులు వివరించారు. ఇకపై జాబ్ మేళాల నిర్వహణలో శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Education Ministry
Student Mental Health Care AP
Heartful Yoga Training
Akshara Andhra Literacy Mission
Skill Development ITI Clusters

More Telugu News