విశాఖకు సీఎం చంద్రబాబు.. వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు

విశాఖకు సీఎం చంద్రబాబు.. వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు

Chandrababu Naidu Visakhapatnam visit brings light to thousands of families
  • విశాఖలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
  • రూ.8,874 కోట్ల విలువైన 399 ఎకరాల భూమి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం శ్రీకారం
  • దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కలకు లభించిన చట్టబద్ధ హక్కు
  • పట్టాల పంపిణీతో లక్షాధికారులు అవుతామంటూ లబ్ధిదారుల ఆనందోత్సాహాలు
  • గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోతామని భయపడ్డామన్న స్థానికులు
దశాబ్దాలుగా నలుగుతున్న అతి పెద్ద సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపింది. విశాఖపట్నంలో ఏళ్ల తరబడి నివాసముంటున్నప్పటికీ తమ ఇళ్లపై ఎలాంటి హక్కులు లేక అభద్రతాభావంతో గడుపుతున్న వేలాది పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తోంది. 

సీఎం చంద్రబాబు కాసేపట్లో విశాఖ చేరుకుని, నగరంలోని 28,445 కుటుంబాలకు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమం ద్వారా సుమారు రూ.8,874 కోట్ల విలువైన 399 ఎకరాల భూమిపై పేదలకు సంపూర్ణ హక్కులు లభించనున్నాయి.

విశాఖ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించడం ఇదే తొలిసారి. 11 మండలాల పరిధిలోని 19,33,853 చదరపు గజాల భూమిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణంలోనే నియోజకవర్గాలు, వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

విశాఖ రూరల్ మండలంలో అత్యధికంగా 9,261 కుటుంబాలు లబ్ధి పొందుతుండగా, గాజువాక, ములగాడ, గోపాలపట్నం, పెందుర్తి వంటి ప్రాంతాల్లోనూ వేలాది కుటుంబాలకు పట్టాలు అందనున్నాయి.

ఈ కార్యక్రమం నేపథ్యంలో లబ్ధిదారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 35-40 ఏళ్లుగా నివాసముంటున్నా తమ ఇళ్లపై తమకు హక్కు లేదని, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడ్డామని లబ్ధిదారులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం పేరుతో తమ స్థలాలను కొట్టేస్తారేమోనని తీవ్ర ఆందోళన చెందామని పెద్దజాలరిపేట వాసులు నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 

ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో తమకు పట్టాలు వస్తుండటంతో లక్షాధికారులయ్యామని, తమ స్థలాల విలువ ఒక్కసారిగా రెట్టింపు అయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'పేదలకు పట్టాభిషేకం' పేరుతో కూటమి నేతలు లబ్ధిదారులను ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించారు. దీంతో విశాఖలోని పలు కాలనీల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Advertisement
Chandrababu Naidu
Visakhapatnam house site regularization
AP Alliance Government
Vizag land pattas distribution
Andhra Pradesh housing scheme
Chandrababu Naidu Vizag visit

More Telugu News