రూ.12 లక్షల కోట్ల డాలర్‌ డిపాజిట్లు.. బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల లాభం?

రూ.12 లక్షల కోట్ల డాలర్‌ డిపాజిట్లు.. బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల లాభం?

SBI Research predicts 5 lakh crore profit for banks from dollar deposits
  • ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) పథకంతో 127 బిలియన్‌ డాలర్ల సమీకరణ
  • బ్యాంకులకు రూ.5 లక్షల కోట్ల నామమాత్రపు లాభమని అంచనా
  • ఆర్‌బీఐకి మరో రూ.50 వేల కోట్ల లాభం రావచ్చన్న ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక
  • భారీ నిధులతో ద్రవ్య లభ్యత పెరిగిందన్న ఆందోళన అవసరం లేదని నివేదిక
  • హెడ్జింగ్‌, కరెన్సీ నష్టాలను కలిపి లెక్కించడం సరికాదన్న ఎస్‌బీఐ రీసెర్చ్‌
దేశంలోని బ్యాంకులకు డాలర్‌ డిపాజిట్లు భారీ లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ (బీ) డిపాజిట్‌ పథకం కింద మూడు నెలలలోపే 127 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.12.2 లక్షల కోట్లు) సమీకరించినట్లు పేర్కొంది. ఈ మొత్తంతో వచ్చే ఐదేళ్లలో బ్యాంకులకు దాదాపు రూ.ఐదు లక్షల కోట్ల మేర నామమాత్రపు లాభం రావచ్చని అంచనా వేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌కు మరో రూ.50 వేల కోట్ల లాభం వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఈ పథకం వల్ల బ్యాంకులపై భారీ ఖర్చు పడుతుందన్న వాదనలను ఎస్‌బీఐ రీసెర్చ్‌ తోసిపుచ్చింది. డాలర్లను సమీకరించేందుకు చెల్లించే వడ్డీ, కరెన్సీ మారకం రిస్క్‌ను తగ్గించేందుకు చేసే హెడ్జింగ్‌ ఖర్చు.. ప్రధాన వ్యయాలని వివరించింది.

అయితే డాలర్‌ విలువలో మార్పును, హెడ్జింగ్‌ ఖర్చును కలిపి లెక్కించి భారీ నష్టాన్ని చూపడం సరికాదని నివేదిక పేర్కొంది. బ్యాంకులు తమ డాలర్‌ బకాయిలకు హెడ్జింగ్‌ చేసుకుంటాయని తెలిపింది. అందువల్ల మారకం విలువలో మార్పు ప్రభావం మెచ్యూరిటీ సమయంలో పెద్దగా ఉండదని వివరించింది.

ఇక భారీగా నిధులు రావడం వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరిగిందన్న ఆందోళన అవసరం లేదని ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. పండగల సమయంలో పెరిగే డిమాండ్‌, రుణాల పంపిణీ, కొత్త రుణాల మంజూరు, అడ్వాన్స్‌ ట్యాక్స్‌, జీఎస్‌టీ చెల్లింపుల వల్ల ఈ నిధులు వ్యవస్థలోనే వినియోగంలోకి వస్తాయని పేర్కొంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ విషయానికొస్తే.. సుమారు 100 బిలియన్‌ డాలర్లను విదేశీ పెట్టుబడి అవకాశాల్లో నాలుగు శాతం రాబడితో పెట్టుబడి పెడితే ఐదేళ్లలో 20 బిలియన్‌ డాలర్ల ఆదాయం రావచ్చని నివేదిక అంచనా వేసింది. హెడ్జింగ్‌ ఖర్చు 15 బిలియన్‌ డాలర్లు పోయినా ఐదు బిలియన్‌ డాలర్ల మేర మిగులు ఉండొచ్చని తెలిపింది. ప్రస్తుత అధిక వడ్డీ రేట్ల పరిస్థితిలో అంచనా కంటే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
Advertisement
SBI Research
Indian Banks Profit
FCNR B Deposit Scheme
Dollar Deposits India
Reserve Bank of India
Banking Sector Liquidity

More Telugu News