మద్యం షాపుల రెన్యూవల్: ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సిందేనన్న హైకోర్టు

మద్యం షాపుల రెన్యూవల్: ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సిందేనన్న హైకోర్టు

Liquor shop renewal High Court says government fee must be paid
  • మద్యం షాపుల రెన్యూవల్ ఫీజుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ 
  • తుది తీర్పుకు లోబడి ఫీజు ఉంటుందని తెలిపిన ధర్మాసనం
  • పిటిషనర్లు గెలిస్తే అదనపు మొత్తం సర్దుబాటు చేస్తామని ప్రభుత్వ హామీ
  • ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరీల మధ్య ఫీజు వ్యత్యాసంపై యజమానుల పిటిషన్
ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుము వివాదంపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించి, లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దుకాణ యజమానులను ఆదేశించింది. దరఖాస్తులకు సెప్టెంబర్ 21 ఆఖరి తేదీ కావడంతో ఈ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రెన్యూవల్ ఫీజు తుది మొత్తం ఈ కేసులో వెలువడే తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లు విజయం సాధిస్తే, వారు చెల్లించిన అదనపు మొత్తాన్ని భవిష్యత్ లావాదేవీలలో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ హామీని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ప్రస్తుతానికి నోటిఫై చేసిన ఫీజునే చెల్లించాలని సూచించింది.

ఓపెన్ కేటగిరీ దుకాణాలకు, కల్లుగీత కేటగిరీ దుకాణాలకు మధ్య పునరుద్ధరణ ఎక్సైజ్ ట్యాక్స్ (RET) విధింపులో ప్రభుత్వం వ్యత్యాసం చూపడాన్ని సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన పలువురు మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నిబంధన వివక్షాపూరితమని, సంబంధిత జీవోలను రద్దు చేయాలని వారు కోరారు. వార్షిక ఆదాయంలో 38 శాతం రుసుముగా వసూలు చేస్తున్నారని పిటిషనర్లు వాదించారు.

అయితే, లైసెన్స్ పునరుద్ధరణ అనేది పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరినీ బలవంతం చేయడం లేదని అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేశారు. 38 శాతం రుసుము అనేది వార్షిక ఆదాయంపై కాదని, గతంలో చెల్లించిన లైసెన్స్ ఫీజులో 38 శాతం మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Advertisement
Andhra Pradesh High Court
Liquor shop license renewal
AP liquor policy
License renewal fee
Justice Lisa Gill
AP Excise Tax

More Telugu News