మా ఆస్తులు తీసుకుని రూ. 1,000 కోట్లు ఇవ్వండి: రేవంత్ కు కేటీఆర్ సవాల్
- బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న కేటీఆర్
- హైదరాబాద్ అభివృద్ధి కోసం రాత్రంబవళ్లు ప్రయత్నించామని వెల్లడి
- కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల భూమి ఉందని అసత్య ప్రచారం చేశారని మండిపాటు
ఫార్ములా ఈ-రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు హాజరైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయడం వదిలేసి, బీఆర్ఎస్ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారిందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఒక సంచలన ఆఫర్ విసిరారు. "మా కుటుంబ ఆస్తులన్నింటినీ ప్రభుత్వమే తీసుకుని, దానికి ప్రతిఫలంగా మాకు రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమన్నా పెడతాను. మిగిలిన రూ. 99,000 కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేయండి" అని సవాల్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం, పెట్టుబడులను ఆకర్షించేందుకు తాము రాత్రింబవళ్లు ప్రయత్నిస్తే, తమపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే భూకేటాయింపుల ఆరోపణలపై మాట్లాడుతుండగా, గతంలో కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల భూమి ఉందంటూ అసత్య ప్రచారం చేశారని, కానీ ఇటీవల అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్‌కు ఉన్నది కేవలం 67 ఎకరాలేనని ఒప్పుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదని, న్యాయపరంగానూ, రాజకీయంగానూ ఈ వేధింపులను ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.