హనీమూన్ విషాదం: బార్బెక్యూ చేస్తుండగా నవవధువుపై ఎగసిపడిన మంటలు

హనీమూన్ విషాదం: బార్బెక్యూ చేస్తుండగా నవవధువుపై ఎగసిపడిన మంటలు

Honeymoon Tragedy Bride Engulfed in Flames While Barbecuing
  • హనీమూన్‌కు వెళ్లిన నవవధువుకు అగ్నిప్రమాదం
  • బార్బెక్యూ మంటలపై కెమికల్ పోయడంతో ఘటన
  • దాదాపు 60 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
  • హోంస్టే యాజమాన్యం నిర్లక్ష్యంపై పోలీసులకు భర్త ఫిర్యాదు
హనీమూన్‌కు వెళ్లిన ఓ నవవధువు జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ జిల్లాలో బార్బెక్యూ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఆమె ఒంటికి నిప్పంటుకుని తీవ్రంగా గాయపడింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా చోప్రాకు చెందిన సమీర్ దాస్, నికితా దాస్‌లకు రెండు నెలల క్రితం వివాహమైంది. హనీమూన్ కోసం ఈ జంట సెప్టెంబర్ 13న కాలింపాంగ్‌లోని సిటాంగ్‌లో ఉన్న ఒక ప్రైవేట్ హోంస్టేకు వెళ్లారు. అదే రోజు రాత్రి వారు బార్బెక్యూ ఏర్పాటు చేసుకోగా, రాత్రి 8:22 గంటల సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి బార్బెక్యూ మంటలపై ఓ డబ్బాలోని ద్రావణాన్ని పోశాడు. క్షణాల్లో మంటలు భారీగా ఎగసిపడి సమీపంలో కూర్చున్న నికిత దుస్తులకు అంటుకున్నాయి. దీంతో ఆమె మంటల్లో చిక్కుకుని కిందపడిపోయింది.

వెంటనే స్పందించిన భర్త సమీర్, ద్రావణం పోసిన వ్యక్తి తమ టీ-షర్టులతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. హోంస్టే సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సాయం చేశారు. తీవ్రంగా గాయపడిన నికితను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమె శరీరం దాదాపు 60 శాతం కాలిపోయినట్లు సమాచారం.

ఈ ఘటనపై భర్త సమీర్ కుర్సియాంగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హోంస్టే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తెలియని రసాయనాన్ని మంటల్లో పోశారని ఆరోపించారు. అంతేకాకుండా, ప్రమాద సమయంలో అక్కడ ఎలాంటి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ గానీ, అత్యవసర ఏర్పాట్లు గానీ లేవని, సాయం అందడంలో ఆలస్యం జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Advertisement
Nikita Das
Kalimpong fire accident
Honeymoon tragedy West Bengal
Barbecue fire accident
Sitong homestay negligence
West Bengal honeymoon tragedy

More Telugu News