వైభవంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.. పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
- అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్ రెడ్డి
- సామాజిక న్యాయమే పునాదిగా పాలన అందిస్తున్నామన్న సీఎం
- రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు
తెలంగాణ వ్యాప్తంగా ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ’ వేడుకలు సెప్టెంబర్ 17న అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని చారిత్రాత్మక పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకునే ముందు గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలను స్మరిస్తూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పబ్లిక్ గార్డెన్స్‌లో పోలీసు బలగాల నుంచి రేవంత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
వేడుకల్లో భాగంగా సీఎం ప్రసంగిస్తూ... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, స్వేచ్ఛ, సామాజిక న్యాయమే పునాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన ‘ప్రజా పాలన’ను అందిస్తోందని స్పష్టం చేశారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.