భారత రైల్వే చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌లో ఒక అద్భుతమైన ఇంజినీరింగ్ నిర్మాణం రూపుదిద్దుకుంది. అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్న బులెట్ ట్రైన్ స్టేషన్ పై అంతస్తులో ఉండగా, దాని కింద నుంచే సాధారణ రైళ్లు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. ఈ చారిత్రక ఘట్టంలో భాగంగా, బుల్లెట్ స్టేషన్ కింద కొత్తగా నిర్మించిన మూడు బ్రాడ్ గేజ్ లైన్లు, వాటికి అనుసంధానంగా ఉన్న ప్లాట్‌ఫారాలను రైల్వే సేఫ్టీ కమిషనర్ (CRS) తనిఖీ చేయడంతో కీలక ముందడుగు పడింది.

అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, యార్డ్ పునరుద్ధరణలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టారు. పశ్చిమ సర్కిల్ (ముంబై) రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ. శ్రీనివాస్.. కొత్తగా వేసిన 16, 17, 18 నంబర్ లైన్లను, వాటికి సంబంధించిన 10, 11, 12 నంబర్ ప్లాట్‌ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీ విజయవంతంగా పూర్తయినప్పటికీ, అవసరమైన తుది భద్రతా అనుమతులు లభించి, ఇతర సాంకేతిక, కార్యాచరణ ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఈ ప్లాట్‌ఫారాలపై ప్రయాణికుల సేవలు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అహ్మదాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ వేద్ ప్రకాశ్ మాట్లాడుతూ.. "భారత రైల్వే ఆధునికీకరణలో ఇది ఒక చారిత్రక విజయం. పైన బుల్లెట్ ట్రైన్ స్టేషన్... దాని కింద సాధారణ రైళ్ల కోసం ప్లాట్‌ఫారాలు, రైల్వే లైన్లు నిర్మించడం అపూర్వం. ఆధునిక రైల్వే ఇంజినీరింగ్ నైపుణ్యానికి, విభిన్న రైల్వే వ్యవస్థల మధ్య సాంకేతిక సమన్వయానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ" అని కొనియాడారు. హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగానే ఈ ప్లాట్‌ఫారాలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.

ఈ కొత్త ప్లాట్‌ఫారాలు అందుబాటులోకి వస్తే ఎక్స్‌ప్రెస్ రైళ్లు, వందే భారత్ సర్వీసులు, స్థానిక ప్యాసింజర్ రైళ్లను సైతం నడపడానికి వీలవుతుంది. దీనివల్ల స్టేషన్ సామర్థ్యం గణనీయంగా పెరిగి, రైళ్ల రాకపోకల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుంది. హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కారణంగా 2022 జూలై నుంచి ప్లాట్‌ఫారం 10ను మూసివేశారు. ఇప్పుడు కొత్త లైన్ల నిర్మాణం పూర్తికావడంతో త్వరలోనే 10, 11, 12 ప్లాట్‌ఫారాలపై కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి.
.