రెస్టారెంట్‌లో రూ.230, స్విగ్గీలో రూ.436.. హైదరాబాదీ పోస్ట్‌తో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌పై కొత్త చర్చ!

రెస్టారెంట్‌లో రూ.230, స్విగ్గీలో రూ.436.. హైదరాబాదీ పోస్ట్‌తో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌పై కొత్త చర్చ!

Swiggy vs Restaurant bill Hyderabad post sparks debate on online food prices
  • రెస్టారెంట్, స్విగ్గీ బిల్లులను పోలుస్తూ ఓ హైదరాబాదీ పెట్టిన పోస్ట్ వైరల్
  • హోటల్‌లో రూ.230 అయిన ఫుడ్‌కు, స్విగ్గీలో రూ.436 బిల్లు చూపించడంతో చర్చ
  • దాదాపు రెట్టింపు ధరపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
  • ఇది సౌకర్యానికి చెల్లించే రుసుమని కొందరు, దోపిడీ అని మరికొందరి వాదన
  • డిస్కౌంట్లు, సమయం ఆదాను కూడా పరిగణించాలంటున్న నెటిజన్లు
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్ ధరల కన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తుందన్నది తెలిసిన విషయమే. అయితే, ఈ వ్యత్యాసం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉండటంతో ఓ హైదరాబాదీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. 

తాను రెస్టారెంట్‌లో తిన్న ఫుడ్ బిల్లును, అదే మెనూను స్విగ్గీలో ఆర్డర్ చేస్తే చూపిన బిల్లుతో పోలుస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. హోటల్‌లో జీఎస్టీతో కలిపి రూ.230 అయిన బిల్లు, స్విగ్గీలో ఎలాంటి డిస్కౌంట్ వర్తించక ముందు ఏకంగా రూ.436గా కనిపించడమే ఈ చర్చకు కారణమైంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ‘పంచకట్టు దోస’ రెస్టారెంట్‌కు వెళ్లిన ‘@idlebrainjeevi’ అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్, అక్కడి బిల్లును స్విగ్గీ యాప్‌లోని ధరలతో పోల్చారు. రెస్టారెంట్ బిల్లు ప్రకారం నెయ్యి కారం ఆనియన్ దోస ధర రూ.104, నెయ్యి పొంగల్ రూ.85, ఫిల్టర్ కాఫీ రూ.28గా ఉన్నాయి. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు రూ.230 అయింది.

అయితే, స్విగ్గీ యాప్‌లో అవే వంటకాల ధరలను చూస్తే, ఆనియన్ దోస రూ.149, పొంగల్ రూ.115, స్పెషల్ ఫిల్టర్ కాఫీ రూ.120గా నమోదై ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.436గా చూపించింది. అంటే.. రెస్టారెంట్ ధరలతో పోలిస్తే దాదాపు రూ.206 అదనంగా ఉంది. ఈ ధరల వ్యత్యాసంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

“రవాణా ఖర్చులు కలుపుకొన్నా దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి తినడమే ఆర్థికంగా మంచిది” అని ఒకరు కామెంట్ చేయగా, “డెలివరీ సంస్థలు, డ్రైవర్లు లాభం పొందాలంటే ధరలు ఒకేలా ఎలా ఉంటాయి? ఇది సాధ్యం కాదు. సౌకర్యానికి కొంత వెల చెల్లించాల్సిందే”
అని మరొకరు అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ పోలికలో కూపన్లు, డిస్కౌంట్లు, ప్రయాణ ఖర్చులు, సమయం ఆదా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని మరికొందరు గుర్తుచేశారు. ఇంటి వద్దకే ఆహారం డెలివరీ అయ్యే సౌకర్యానికి ఈ అదనపు ఖర్చు చెల్లించడం సమంజసమేనని చాలామంది భావిస్తున్నారు. ఏదేమైనా ఈ పోస్ట్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ధరల విధానంపై మరోసారి విస్తృత చర్చకు తెరలేపింది.
Advertisement
Swiggy
Hyderabad food prices
Panchakattu Dosa
Online food delivery debate
Swiggy vs Restaurant price
Food delivery charges India

More Telugu News