క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు ఏఐ ఎఫెక్ట్‌.. ఐఐఎస్సీ ప్రొఫెసర్‌ కీలక ప్రశ్న!

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు ఏఐ ఎఫెక్ట్‌.. ఐఐఎస్సీ ప్రొఫెసర్‌ కీలక ప్రశ్న!

AI effect on campus placements IISc Professor raises key questions
  • క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌పై ఐఐఎస్సీ ప్రొఫెసర్‌  కీలక ప్రశ్న
  • ఏఐతో కొన్ని ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు తగ్గొచ్చని అంచనా
  • కంపెనీలు తక్కువ మందితో ఎక్కువ పని చేసే అవకాశం
  • ఏఐ వినియోగంపై అవగాహన విద్యార్థులకు కీలకం
  • ఏఐ ఇచ్చే సమాచారాన్ని తనిఖీ చేసే నైపుణ్యం అవసరమన్న ప్రొఫెసర్‌
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యూనివర్సిటీ విద్య భవిష్యత్తుపై ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ (ఐఐఎస్సీ) ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రతోష్‌ కీలక ప్రశ్న లేవనెత్తారు. రాబోయే ఐదేళ్ల నుంచి పదేళ్లలో కంపెనీలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ను గణనీయంగా తగ్గిస్తే.. యూనివర్సిటీ విద్య ఉద్దేశం ఏమిటన్నది విద్యార్థులు ఆలోచించాలని సూచించారు.

ప్రస్తుతం ఏఐతో కోడింగ్‌, డేటా విశ్లేషణ, రిపోర్టుల తయారీ, పరిశోధన వంటి పనులను వేగంగా చేయగలుగుతున్నారు. దీంతో గతంలో జూనియర్‌ ఉద్యోగులు చేసిన కొన్ని పనులకు ఇక ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేకపోవచ్చు. ఫలితంగా ఫ్రెషర్ల నియామకాలు తగ్గే అవకాశం ఉందన్నది ఆయన ఆందోళన.

భారత్‌లో ఉన్నత విద్య నుంచి ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టేందుకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు కీలక మార్గంగా ఉన్నాయి. అయితే ఏఐ సాయంతో తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని పూర్తి చేయగలిగితే.. కంపెనీలు గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగులను తీసుకోకపోవచ్చు.

ఉదాహరణకు గతంలో 100 మంది చేయాల్సిన పనిని ఏఐ సాయంతో 50 మందితోనే పూర్తి చేయగలిగితే.. కొత్త నియామకాలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు పూర్తిగా కనుమరుగవుతాయని దీని అర్థం కాదు. మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా విద్యార్థులను ఎలా సిద్ధం చేయాలన్న ప్రశ్న మాత్రం ముందుకొస్తుంది.

ఏఐ కారణంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిన నైపుణ్యాల్లోనూ మార్పులు రావచ్చని ప్రొఫెసర్‌ అభిప్రాయం. సమాచారం వెతకడం, అర్థం చేసుకోవడం, పనిలో ఉపయోగించడం వంటి వాటిలో ఏఐ ఇప్పటికే సాయం చేస్తోంది. దీంతో సరైన ప్రశ్నలు అడగడం, ఏఐ ఇచ్చే సమాచారాన్ని పరిశీలించడం, దాన్ని ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరగొచ్చు.

అయితే ఏఐ వాడకం పెరగడంతో యూనివర్సిటీ డిగ్రీల విలువ తగ్గిపోదని నిపుణుల అభిప్రాయం. ప్రయోగశాలలు, అధ్యాపకులు, పరిశోధన ప్రాజెక్టులు, ఇతర విద్యార్థులతో కలిసి పనిచేసే అవకాశాలు యూనివర్సిటీల్లో లభిస్తాయి. ఇవి ఉద్యోగానికి అవసరమైన సమాచారాన్ని నేర్చుకోవడానికి మించిన అనుభవాన్ని అందిస్తాయి.

భవిష్యత్తులో యూనివర్సిటీల దృష్టి ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా పరిశోధన, సమస్యల పరిష్కారం, ప్రయోగాలు, కొత్త సాంకేతికతలతో కలిసి పనిచేసే సామర్థ్యంపై ఉండాల్సిన అవసరం రావచ్చన్నది ఈ చర్చ సారాంశం. రాబోయే ఐదేళ్ల నుంచి పదేళ్లలో క్యాంపస్‌ నియామకాలు ఎంతమేర తగ్గుతాయన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఏఐ మారుతున్న కొద్దీ విద్యా విధానం కూడా మారాల్సిన అవసరం ఉందన్న ప్రశ్న మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
Advertisement
IISc Professor Dr Pratosh
AI Impact on Placements
Future of Campus Recruitment
Artificial Intelligence Education
IISc Bangalore News
AI Job Market India

More Telugu News