భారత మహిళల జట్టుకు స్మృతి ఇరానీ అభినందనలు

భారత మహిళల జట్టుకు స్మృతి ఇరానీ అభినందనలు

Smriti Irani congratulates Indian Womens Cricket Team for Asia Cup victory
  • మహిళల ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత్
  • ఫైనల్‌లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం
  • షఫాలీ వర్మ, స్మృతి మంధానల అద్భుత అర్ధ సెంచరీలు
  • బౌలింగ్‌లో సత్తా చాటిన శ్రీ చరణి, దీప్తి శర్మ
ఆసియా కప్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్‌ జట్టుకు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో శ్రీలంకపై సాధించిన అద్భుత విజయం జట్టు కృషికి, పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. భారత మహిళల జట్టు ప్రదర్శన దేశం గర్వపడేలా చేసిందని ప్రశంసిస్తూ, భవిష్యత్తులోనూ టీమిండియా మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో భారత్‌ 72 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో 2024 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారత ఓపెనర్లు షఫాలీ వర్మ (39 బంతుల్లో 68), స్మృతి మంధాన (39 బంతుల్లో 59) అద్భుత అర్ధ సెంచరీలతో చెలరేగారు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షఫాలీ, మహిళల ఆసియా కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, భారత బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో శ్రీ చరణి 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆసియా కప్ ఫైనల్స్‌లో శ్రీలంకపై భారత్‌కు ఇది ఆరో విజయం కావడం విశేషం.
Advertisement
Smriti Irani
Indian Womens Cricket Team
Asia Cup 2024
Shafali Verma
Smriti Mandhana
India vs Sri Lanka Final

More Telugu News