‘దూరంగా ఉండమన్నందుకు’.. మహిళా బైకర్‌ను వెంటాడి ఢీకొట్టిన కారు: వీడియో వైరల్‌

‘దూరంగా ఉండమన్నందుకు’.. మహిళా బైకర్‌ను వెంటాడి ఢీకొట్టిన కారు: వీడియో వైరల్‌

Car chases and hits female biker for asking to maintain distance viral video
  • తనను కారు వెంబడించిందని మహిళా బైకర్‌ సియా ఆరోపణ
  • దూరంగా ఉండమన్నా కారు ఆగలేదని వెల్లడి
  • బైక్‌కు అడ్డంగా వచ్చి కారు ఢీకొట్టిందని ఆరోపణ
  • ప్రమాదం తర్వాత కారు ఆగకుండా వెళ్లిపోయిందని ఆరోపణ
  • డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్‌ మీడియాలో డిమాండ్లు
రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళా బైకర్‌ను కారు వెంబడించింది. తనకు కాస్త దూరంగా ఉండాలని ఆమె చెప్పింది. అయినా కారు ఆగలేదు. చివరకు బైక్‌కు అడ్డంగా వచ్చి ఢీకొట్టిందని సియా అనే బైకర్‌ ఆరోపించారు. ప్రమాదం ధాటికి ఆమె బైక్‌ నుంచి కిందపడిపోయారు. బైక్‌ మాత్రం రోడ్డుపై కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఘటన మొత్తం బైక్‌కు అమర్చిన యాక్షన్‌ కెమెరాలో రికార్డవడంతో వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగినట్లు సియా తెలిపారు. ఏప్రిలియా ఆర్‌ఎస్‌ 457 స్పోర్ట్స్‌ బైక్‌పై ఆమె తన బైకింగ్‌ గ్రూప్‌తో కలిసి వెళ్తున్నారు. అప్పటి నుంచే ఓ కారు తనను వెంబడిస్తోందని ఆమె ఆరోపించారు.

కారు తన దగ్గరకు వచ్చిన సమయంలో అందులో ఉన్నవారు దురుసుగా ప్రవర్తించారని సియా చెప్పారు. కాస్త దూరంగా ఉండాలని కోరగా.. బైక్‌ ఆపాలని చెప్పారని తెలిపారు. వారు మద్యం మత్తులో ఉన్నట్లు అనిపించిందన్నారు. కారు తనను అడ్డుకోకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించానని చెప్పారు.

ఆమె వెనుకే వస్తున్న స్నేహితుడు కూడా పరిస్థితిని గమనించి కారు తనకు దగ్గరగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని సియా తెలిపారు. అయినా కారు తమను వెంబడించడం కొనసాగించిందన్నారు. చివరకు డ్రైవర్‌ తన బైక్‌కు అడ్డంగా కారు తీసుకురావడంతో ఢీకొట్టినట్లు ఆరోపించారు. ఆ వెంటనే కారు అక్కడి నుంచి దూసుకెళ్లిపోయిందన్నారు.

ప్రమాదం తర్వాత సియా స్నేహితుడు కారును వెంబడించారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద కారును ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించినట్లు తెలిపారు. ప్రమాదం అతడి తప్పిదం వల్లే జరిగిందని చెప్పినా.. డ్రైవర్‌ అంగీకరించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడని సియా ఆరోపించారు.

ఈ ఘటనపై గురుగ్రామ్‌ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కారు నంబర్‌తో పాటు ఆర్సీ యజమాని పేరును కూడా వెల్లడించారు. వీడియో బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో తీవ్ర స్పందన కనిపించింది. గురుగ్రామ్‌ పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు, హర్యానా పోలీసులను ట్యాగ్‌ చేస్తూ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.
Advertisement
Siya Biker
Gurugram road rage
Female biker accident video
Golf Course Road Gurugram
Aprilia RS 457 accident
Viral road rage video

More Telugu News