కేరళంలోని త్రిప్రయార్ శ్రీరామస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

కేరళంలోని త్రిప్రయార్ శ్రీరామస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan visits Thriprayar Sree Ramaswamy Temple in Kerala
  • త్రిప్రయార్ ఆలయంలో దీపారాధన సేవలో పాల్గొన్న పవన్
  • మీనుట్టు, వేది వజిపాడు కార్యక్రమాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
  • సంధ్యాకాల అర్చనలను నిర్వహించిన పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళంలోని అత్యంత పురాతన, సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రమైన త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆయుర్వేద చికిత్స నిమిత్తం కేరళంలో ఉన్న ఆయన... ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎంతో విశిష్టమైనదిగా భావించే ‘దీపారాధన’ సేవలో పవన్ పాల్గొన్నారు. ఒక్కరోజు దీపారాధన సేవకు విరాళం అందించారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ మందిరంలోని ప్రధాన దీపాలను వెలిగించారు.


ఆలయ సాంప్రదాయాలను పాటిస్తూ శ్రీరామస్వామి వారి సన్నిధిలో నిర్వహించే ప్రత్యేక ఆధ్యాత్మిక ఆచారాలైన ‘మీనుట్టు’ (చేపలకు ఆహారం అందించే సేవ), అలాగే ‘వేది వజిపాడు’ (బాణాసంచా కాల్చే సేవ) కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. శంఖుచక్రాలు, ధనుస్సు, రత్న హారాలతో ప్రకాశిస్తున్న శ్రీరామచంద్రుని దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామస్వామివారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణుడికి, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు.


అనంతరం మాలవిరాట్టుకి కుడివైపున ఉన్న శ్రీ దక్షిణామూర్తికి, నైరుతి మూలన ఉన్న వినాయకుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అర్చకుల నుంచి తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనాలు స్వీకరించారు. అంతకు ముందు పవన్ కు ఆలయ బోర్డు చైర్మన్, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మరోవైపు, ఆలయం సమీపంలోనే పవన్ ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు.

Advertisement
Pawan Kalyan
Thriprayar Sree Ramaswamy Temple
Kerala Temple Visit
AP Deputy CM
Ayurvedic Treatment Kerala
Deeparadhana Ritual

More Telugu News