ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు నోటీసులు.. వార్తలను ఖండించిన ఎన్నికల సంఘం

ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు నోటీసులు.. వార్తలను ఖండించిన ఎన్నికల సంఘం

CNR Rao ECI denies reports of issuing notices to Bharat Ratna scientist
  • ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు నోటీసులు జారీ చేశారన్న వార్తల్లో నిజం లేదని వెల్లడి
  • ఓటరు జాబితాలో పేరు తేడా కారణంగా నోటీసులిచ్చారన్న ప్రచారాన్ని ఖండించిన ఈసీ
  • ఆయన గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టత
భారతరత్న గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు నోటీసులు జారీ చేసినట్లు వస్తున్న వార్తలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా ఖండించింది. కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా, ఆయన పేరులో అక్షర దోషం ఉందన్న కారణంతో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది.

పాత ఓటరు జాబితాలో ‘Prof. C.N.R. Rao’ అని ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘Proff. C.N.R. Rao’ అని అదనంగా 'f' అక్షరం నమోదైందని, ఈ వ్యత్యాసంపై వివరణ ఇవ్వాలని 92 ఏళ్ల వయస్సున్న శాస్త్రవేత్తకు నోటీసులు పంపినట్లు వివిధ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఈ విచారణ జరగనుందని ఆ కథనాలు సారాంశం.

అయితే, ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి 2002 నాటి జాబితాలో ఆయన పేరు ‘రామ S/O హెచ్. నగేష్’ అని ఉండగా, ప్రస్తుత జాబితాలో ‘ప్రొఫ్. సీఎన్ఆర్ రావు S/O నగేష్ రావ్. హెచ్’ అని సవరించబడి ఉందని వివరించింది. దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలను, ఆయనకున్న అత్యున్నత గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకు ఆయనకు గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఈసీ స్పష్టం చేసింది.

ఘన స్థితి, నిర్మాణ రసాయన శాస్త్ర రంగాలలో ప్రొఫెసర్ రావు అందించిన సేవలు అపారమైనవి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' అందుకున్న మూడో శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు పొందారు. గతంలో ఆయనను పద్మవిభూషణ్, పద్మశ్రీ సహా అనేక ప్రతిష్ఠాత్మక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి.
Advertisement
CNR Rao
Election Commission of India
Bharat Ratna
Karnataka voter list
ECI notice clarification

More Telugu News