బాలీవుడ్ లో ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రెస్ గా తాప్సీ కనిపిస్తుంది. కథ ఏదైనా దానిని భుజాన వేసుకుని మోయగల సత్తా తనకి ఉందని ఆమె నిరూపించింది. అందుకు నిదర్శనంగా నిలిచే సినిమాలు ఆమె కెరియర్లో కనిపిస్తాయి. అలాంటి తాప్సీ రీసెంట్ గా చేసిన సినిమానే 'గాంధారి'. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి వచ్చింది.
'బని' (తాప్సీ) ఆమె భర్త 'గోకుల్' (ఇష్వాక్ సింగ్) తమ ఐదేళ్ల కూతురు 'మిస్తీ'తో కలిసి రైల్లో వెళుతూ ఉంటారు. మార్గమధ్యంలో రైలు 'జాయ్ పూర్' స్టేషన్ లో ఆగుతుంది. ఆ సమయంలోనే ఒక గుర్తుతెలియని మహిళ, 'మిస్తీ'ని కిడ్నాప్ చేస్తుంది. తన కూతురును కాపాడుకునే ప్రయత్నంలో 'బని' కంటిచూపు దెబ్బతింటుంది. తమ కూతురును కాపాడమని పోలీసులను వాళ్లు ఎంతగా ప్రాధేయపడినా ప్రయోజనం లేకుండా పోతుంది.
వరుసగా జరుగుతున్న ఆడపిల్లల కిడ్నాపుల వెనుక ఎవరున్నారనేది తెలుసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ 'కబీర్' రంగంలోకి దిగుతాడు. అయితే మిగతా ఆఫీసర్లు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వలన, ఆయన ఏమీ చేయలేకపోతుంటాడు. అలాంటి పరిస్థితులలో 'బని'ని 'జును అంబా' (మిత వశిష్ఠ్) కలుసుకుంటుంది. 'జాయ్ పూర్'లో 'బ్లాక్ హోల్' అనే ఒక గ్యాంగ్ ఉందనీ, ఆ గ్యాంగ్ ఆడపిల్లలను అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తుందని చెబుతుంది. తనకి తెలిసి 'మిస్తీ' ఇంకా జాయ్ పూర్ లోనే ఉండి ఉంటుందని అంటుంది.
కొన్ని రోజుల తరువాత 'బనీ'కి చూపువస్తుంది. అయితే జాయ్ పూర్ లో ఏ మూలన ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం, చూపురానట్టుగానే నటిస్తుంటుంది. జాయ్ పురా నుంచి సముద్రం మీదుగా పిల్లలను తరలించడానికి ఏయే మార్గాలు ఉన్నాయనే రహస్యాన్ని ఛేదించడం కోసం ధైర్యంగా ముందుకు వెళుతుంటుంది. ఆ ప్రయత్నంలో ఆమెకి తెలిసే చేదు నిజాలేమిటి? ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? జును అంబాతో ఆమెకి గల అనుబంధం ఏమిటి? తన కూతురును ఆమె కాపాడుకోగలుగుతుందా? అనేది మిగతా కథ.
ఒక తల్లి .. కనిపించకుండా పోయిన తన కూతురు ఆచూకీ తెలుసుకోవడం కోసం రంగంలోకి దిగుతుంది. ఆ సమయంలో తన చూపు కోల్పోయినా ఆమె లెక్క చేయదు. ఆడపిల్లలను అక్రమంగా తరలించే ఒక గ్యాంగ్ గురించి తెలుసుకుని, ఒంటరిగా వాళ్లను ఎదిరించడానికి సిద్ధమవుతుంది. అందుకోసం ఆమె ఎలాంటి ప్రమాదాలకు ఎదురెళ్లవలసి వస్తుంది? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం అని చెప్పాలి.
బని దంపతులు రైల్వే స్టేషన్ లో తమ కూతురును పోగొట్టుకోవడం .. పోలీసుల చుట్టూ తిరగడం .. తామే అన్వేషణ కొనసాగించడం .. అక్కడి గ్యాంగ్ గురించి తెలుసుకోవడం ఫస్టాఫ్ గా కొనసాగుతుంది. ఇక ఆ గ్యాంగ్ కదలికలను గమనించడం .. వాళ్ల బారి నుంచి తమ బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నించడం సెకండాఫ్ గా కనిపిస్తుంది.
చిన్నపిల్లల అక్రమ రవాణ .. ఆ ముఠాను పట్టుకోవడానికి జరిగే ప్రయత్నాల నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఈ కథలో రెండు విషయాలు కొత్తగా అనిపిస్తాయి. చూపు కోల్పోయిన తల్లి తన బిడ్డ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఒకటైతే, దాదాపు నేరస్థులతోనే 'జాయ్ పుర' విలేజ్ ను డిజైన్ చేయడం మరొకటి. తన చుట్టూ ఉన్నవాళ్లంతా, బ్లాక్ హోల్ కి సంబంధించినవాళ్లేనని 'బని' గ్రహించే విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
అయితే ఆడియన్స్ ఆశించే స్థాయిలో దర్శకుడు ఈ కథను తెరపై ఆవిష్కరించలేకపోయాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ 'కబీర్' అంటూ హడావిడి చేశారు. కానీ ఆయన వచ్చి చేసేది ఏమీ ఉండదు. ఆయన తెరపై నుంచి ఎప్పుడు పక్కకి తప్పుకున్నాడనే విషయం కూడా ప్రేక్షకులకు గుర్తుండదు. పోనీ విలన్ వైపు నుంచి కదలికలు ఏమైనా ఉన్నాయా అంటే, అటు వైపు నుంచి కూడా అదే పరిస్థితి. యాక్షన్ .. ఎమోషన్ .. చివర్లో వచ్చే ట్విస్ట్ .. ఇవన్నీ కూడా చాలా రొటీన్ గా అనిపిస్తాయి.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫొటో గ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పటికీ, కథాకథనాల పరంగా రొటీన్ గా అనిపించే కంటెంట్ ఇది. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలుగానీ .. సంభాషణలు గాని లేని ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి ఓ సారి చూడాలనుకుంటే చూడొచ్చు.
'గాంధారి' ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Gandhari Review
Movie Details
Movie Name: Gandhari
Genre: Action, Thriller
Release Date: 2026-09-03
Cast: Taapsee Pannu,Ishwak Singh,Chhaya Kadam,Swastika Mukherjee, Mita Vashisht
Director: Devashish Makhija
PRO: -
Music: Sher Police
Banner: Kathha Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer