యూపీ ఎన్నికల తర్వాత ఫుల్ ఫోకస్ తెలంగాణపైనే.. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు: బండి సంజయ్

యూపీ ఎన్నికల తర్వాత ఫుల్ ఫోకస్ తెలంగాణపైనే.. బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు: బండి సంజయ్

Bandi Sanjay says full focus on Telangana after UP elections and no one can stop BJP victory
  • రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్న బండి సంజయ్
  • కేసీఆర్ సర్కార్ మెడలు వంచింది బీజేపీయేనని వ్యాఖ్య
  • పోలీసుల కేసులకు భయపడాల్సిన అవసరం లేవన్న సంజయ్

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అధిష్ఠానం దృష్టి పూర్తిగా తెలంగాణపైనే ఉంటుందని, రాష్ట్రాన్ని దక్కించుకోవడమే తదుపరి లక్ష్యమని వెల్లడించారు. భద్రాచలంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు, నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ మంత్రి ఢిల్లీకి అక్రమ మార్గాల్లో మూటలు పంపుతున్నారని, గతంలో కేసీఆర్ పాలనలోనూ అదే మంత్రి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఇస్తున్న ఉచిత సన్న బియ్యం, ఇళ్ల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.


గతంలో రజాకార్ల పాలనను తలపించిన కేసీఆర్ సర్కార్ మెడలు వంచింది బీజేపీయేనని గుర్తుచేశారు. "నాపై 109 అక్రమ కేసులు నమోదు చేసినా నేనెప్పుడూ వెనకడుగు వేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి. పోలీసు కేసులకు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు" అని భరోసా ఇచ్చారు.


దేశాన్ని సుదీర్ఘకాలం ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం నాలుగు రాష్ట్రాలకే పరిమితమైందని, తెలంగాణలో కూడా ఆ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Advertisement
Bandi Sanjay
BJP Telangana
Telangana Assembly Elections
Uttar Pradesh Elections
Congress Telangana
Bhadrachalam BJP Meeting

More Telugu News