నెల్లూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఘనస్వాగతం

నెల్లూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఘనస్వాగతం

Yogi Adityanath receives grand welcome in Nellore
  • స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు హాజరైన యూపీ సీఎం యోగి
  • నెల్లూరులో ఘన స్వాగతం పలికిన మంత్రులు నారాయణ, సత్యకుమార్
  • అక్షర విద్యాలయంలో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పరిశీలన
  • శిక్షణ పొందుతున్న యువతతో ముఖాముఖి నిర్వహించిన ఆదిత్యానాథ్
  • ట్రస్ట్ సేవలను, విద్యాసంస్థల నిర్వహణను ప్రశంసించిన యూపీ సీఎం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, వై. సత్యకుమార్ సాదరంగా స్వాగతం పలికారు.

అక్షర విద్యాలయం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన యోగికి మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, కుమారుడు హర్షవర్ధన్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం యోగి అక్షర విద్యాలయం ప్రాంగణంలో ఉన్న సోమా సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.

అక్కడ నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీయువకులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారికి అందుతున్న సాంకేతిక శిక్షణ, భవిష్యత్ అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను, అక్షర విద్యాలయం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు చేస్తున్న కృషిని యోగి ఆదిత్యానాథ్ ప్రశంసించారు. ప్రాంగణంలో విద్యార్థులు నిర్వహించిన స్కేటింగ్ ప్రదర్శనను కూడా ఆయన ఆసక్తిగా తిలకించారు.

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు స్ఫూర్తితో 2001లో ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్, గ్రామీణ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఆరోగ్య సేవలు అందిస్తూ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా యోగి ఆదిత్యానాథ్ భోజనానంతరం ట్రస్ట్ ప్రాంగణానికి చేరుకుని, అక్కడ నిర్వహిస్తున్న ఇతర సేవా కార్యక్రమాలను పరిశీలిస్తారు. అనంతరం ప్రజా మందిరంలో జరిగే ప్రధాన సభలో ముఖ్య అతిథిగా ప్రసంగిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.
Advertisement
Yogi Adityanath
Nellore
Swarna Bharat Trust
Venkaiah Naidu
Silver Jubilee Celebrations
Andhra Pradesh

More Telugu News