స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ డిమాండ్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో సీఎం రేవంత్‌ డిమాండ్

Revanth Reddy sensational demands in Assembly over inappropriate comments on Speaker
  • తాతా మధు వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం
  • ఎమ్మెల్సీని డిస్మిస్ చేయాలని మండలి చైర్మన్ ను కోరిన వైనం
  • స్పీకర్‌ను గౌరవించడం సభా సంప్రదాయమని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ నేతలపై సీఎం తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాతా మధును తక్షణమే చట్టసభ నుంచి డిస్మిస్ చేయాలని శాసనమండలి ఛైర్మన్‌ను కోరారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

శాసనసభలో సోమవారం మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సభాపతి స్థానానికి ఎంతో గౌరవం ఉందన్నారు. స్పీకర్‌ను గౌరవించడం చట్టసభల కనీస సంప్రదాయమని చెప్పారు. సభాపతిపై అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఇది స్పీకర్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని, సభలోని ప్రజాప్రతినిధులందరికీ జరిగిన అవమానమని అన్నారు.

బీఆర్ఎస్ సభ్యులను కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కు పిలిపించి ఉసిగొల్పి పంపడం వల్లే ఆ పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. సభ్యుల హక్కులను కాపాడుతున్న స్పీకర్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించారని విమర్శించారు. ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో సంయమనం పాటిస్తుందని, దాన్ని తమ చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు.

తన రాజకీయ జీవితంలో ఎన్నో సభలను చూశానని, చట్టసభల్లో ఇంత అభ్యంతరకరమైన భాషను ఎప్పుడూ చూడలేదని రేవంత్ అన్నారు. ఇలాంటి వైఖరిని క్షమిస్తూ పోతే ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న గౌరవం దెబ్బతింటుందని హెచ్చరించారు.

మరోవైపు బీజేపీపైనా సీఎం విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ లేవనెత్తిన అంశాలపై చర్చిస్తామని రేవంత్ స్పష్టం చేశారు.
Advertisement
Revanth Reddy
Tata Madhu
Gaddam Prasad Kumar
Telangana Assembly
BRS Party
KCR

More Telugu News