ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్‌ మీడియా కట్టడి? త్వరలో కొత్త నిబంధనలు!

ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్‌ మీడియా కట్టడి? త్వరలో కొత్త నిబంధనలు!

Government employees social media restrictions and new rules coming soon
  • కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సోషల్‌ మీడియా నిబంధనలు
  • ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌పై కోడ్‌ వర్తింపజేసే అవకాశం
  • ఉద్యోగులందరికీ ఒకే నిబంధనలు ఉండే అవకాశం
  • పోస్టులపై పరిమితులు విధించే ఛాన్స్‌
  • ఉల్లంఘనలకు శిక్షలపై రానున్న స్పష్టత
ప్రభుత్వ ఉద్యోగులు ఇక సోషల్‌ మీడియాలో ఏది పడితే అది పోస్టు చేయలేరా? కేంద్ర ప్రభుత్వం త్వరలో దీనిపై స్పష్టమైన నిబంధనలు తీసుకురానున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌, ఫేస్‌బుక్‌ వంటి వేదికల్లో ఉద్యోగులు చేసే పోస్టులపై ప్రత్యేకంగా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక సోషల్‌ మీడియా కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ తీసుకురావాలనే అంశం ఉన్నతస్థాయిలో చర్చకు వచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై అధ్యయనం చేయాలని సీనియర్‌ అధికారులను కోరినట్లు తెలుస్తోంది.

ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించే అవకాశం ఉంది. అధికారి స్థాయి ఏదైనా ఒకే విధమైన నిబంధనలు ఉండొచ్చని సమాచారం. అయితే కొత్త కోడ్‌ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఉద్యోగులు ఏయే పోస్టులు చేయొచ్చు? ఏయే అంశాలపై ఆంక్షలు ఉంటాయి? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

వ్యక్తిగత ప్రచారంపై దృష్టి
ఇటీవల కొందరు ప్రభుత్వ అధికారులు సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. యూట్యూబ్‌ ఛానళ్లు నిర్వహించడం, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పెట్టడం, వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకోవడం చేస్తున్నారు. అధికారిక సమాచారం, వ్యక్తిగత కంటెంట్‌ కలిసిపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం అన్ని శాఖలకు ఒకే సోషల్‌ మీడియా నిబంధనలు లేవు. ఉద్యోగులపై ఆయా శాఖల సర్వీస్‌ రూల్స్‌ వర్తిస్తున్నాయి. అయితే ఈ నిబంధనలు సోషల్‌ మీడియా, రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ వంటి కొత్త వేదికలకు అనుగుణంగా లేవన్న అభిప్రాయం ఉంది.

ఏం పోస్టు చేయొచ్చు?
కొత్త కోడ్‌లో ఉద్యోగులు సోషల్‌ మీడియాలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా అందులో పేర్కొనే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2017లో ఓ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ సోషల్‌ మీడియాలో ఆహార నాణ్యతపై వీడియో పెట్టిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఘటనపై సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియా విస్తృతి పెరగడంతో ప్రత్యేక నిబంధనల అవసరం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా సోషల్‌ మీడియా వేదికలపై కేంద్రం నిబంధనలను కఠినతరం చేస్తోంది. అక్రమ కంటెంట్‌ను తొలగించే గడువును తగ్గించడం, ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను స్పష్టంగా గుర్తించేలా చేయడం వంటి చర్యలు ఇప్పటికే చేపట్టింది.
Advertisement
Government Employees
Social Media Regulations
Code of Conduct
Narendra Modi
Central Government Rules
Digital Media Policy

More Telugu News