కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్‌కూ పడుతుంది: రాంచందర్ రావు
- 22ఏ నిషేధిత భూముల జాబితాపై రాంచందర్ రావు విమర్శలు
- ధరణి పేరుతో ప్రజలను పీడించిన కేసీఆర్ ప్రభుత్వం ఓటమిపాలైందని ఆరోపణ
- రేవంత్ కూడా అదే బాటలో పయనిస్తూ తన గోతిని తానే తవ్వుకుంటున్నారని వ్యాఖ్య
సామాన్యుల ఆస్తులు, రైతుల పొలాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భూదందా సాగిస్తోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. 22ఏ నిషిద్ధ జాబితా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల సొంత భూములను లాక్కునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నాయకత్వంలో ఈరోజు జరిగిన మహాధర్నాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల భూములపై పడ్డ ఏ పాలకుడు చరిత్రలో బాగుపడలేదని హెచ్చరించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం 'ధరణి'తో ప్రజలను పీడించి ఏ విధంగా అధికారానికి దూరమైందో... ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ తన గోతిని తానే తవ్వుకుంటున్నారని మండిపడ్డారు. హైడ్రా, క్యూర్, 22ఏ వంటి నిర్ణయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, 30 శాతం కమీషన్ల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో బీఆర్ఎస్ కంటే దారుణమైన పరాభవం తప్పదని స్పష్టం చేశారు. వెంటనే 22ఏ కింద చేర్చిన బాధితుల భూములపై రివ్యూ జరిపి, ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు.