భారతీయుడి చేతికి అడోబ్‌ పగ్గాలు.. సీఈవోగా అనిల్‌ చక్రవర్తి

Anil Chakravarthy appointed as Adobe CEO succeeding Shantanu Narayen
  • డిసెంబర్‌ 1న బాధ్యతలు చేపట్టనున్న అనిల్‌
  • ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగనున్న శంతను నారాయణ్‌
  • 2020లో అడోబ్‌లో చేరిన అనిల్‌ చక్రవర్తి
  • ఐఐటీ బీహెచ్‌యూ, ఎంఐటీలో చదువుకున్న అనిల్‌
టెక్‌ దిగ్గజం అడోబ్‌కు కొత్త సీఈవో రానున్నారు. భారత సంతతికి చెందిన అనిల్‌ చక్రవర్తి సంస్థ అధ్యక్షుడు, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈవో శంతను నారాయణ్‌ 18 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోనున్నారు. డిసెంబర్‌ 1న అనిల్‌ చక్రవర్తి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అదే సమయంలో అడోబ్‌ బోర్డులోనూ చేరనున్నారు.

శంతను నారాయణ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కొనసాగుతారు. మార్పిడి ప్రక్రియలో అనిల్‌ చక్రవర్తితో కలిసి పనిచేయనున్నారు. అనిల్‌ చక్రవర్తి అనుభవజ్ఞుడైన నాయకుడని, విలువలు, నిజాయతీతో పనిచేస్తారని శంతను నారాయణ్‌ ప్రశంసించారు. అడోబ్‌ వ్యాపారంపై ఆయనకు లోతైన అవగాహన ఉందని తెలిపారు.

అనిల్‌ చక్రవర్తి 2020 జనవరిలో అడోబ్‌లో చేరారు. అంతకుముందు 2015 నుంచి 2020 వరకు ఇన్ఫర్మాటికా సీఈవోగా పనిచేశారు. అడోబ్‌లో చేరిన తర్వాత డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, జనరల్‌ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పలు కీలక పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆర్కెస్ట్రేషన్‌, వరల్డ్‌వైడ్‌ ఫీల్డ్‌ ఆపరేషన్స్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.

అనిల్‌ చక్రవర్తి ఐఐటీ బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ఎంఐటీ నుంచి ఎంఎస్‌, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. సిమాంటెక్‌, వెరిసైన్‌, మెకిన్సీ వంటి సంస్థల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఎఫ్‌ఐఎస్‌ సంస్థ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.

అడోబ్‌ ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న సమయంలో కీలక మార్పు చేస్తోంది. సంస్థ ఉత్పత్తుల్లో ఏఐని విస్తృతంగా తీసుకొచ్చేందుకు అనిల్‌ చక్రవర్తి ఇప్పటికే కీలక పాత్ర పోషించారు. జెన్‌స్టూడియో, అడోబ్‌ సీఎక్స్‌ ఎంటర్‌ప్రైజ్‌, బ్రాండ్‌ విజిబిలిటీ వంటి ఏఐ ఆధారిత ఉత్పత్తులపై ఆయన పనిచేశారు. వర్క్‌ఫ్రంట్‌, సెమ్రష్‌ కొనుగోళ్లు, వాటిని అడోబ్‌ వ్యవస్థలో కలపడంలోనూ భాగస్వామ్యమయ్యారు.

అయితే ఏఐ ప్రభావంతో అడోబ్‌ భవిష్యత్‌ వ్యాపారంపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు ఉన్నాయి. 2024లో కంపెనీ షేరు 25 శాతం, 2025లో మరో 21 శాతం పడిపోయింది. 2026లో ఇప్పటివరకు దాదాపు 18 శాతం క్షీణించింది. కొత్త సీఈవో నియామకం ప్రకటన తర్వాత కూడా షేరు ధర 2 శాతం వరకు తగ్గింది.
Advertisement
Anil Chakravarthy
Adobe CEO
Shantanu Narayen
Adobe AI expansion
Indian origin tech leaders
Informatica former CEO

More Telugu News