ప్రైవేట్‌ కంపెనీలకు స్పేస్‌లో ఎందుకు చోటు? ఇస్రో ఛైర్మన్‌ సంచలన సమాధానం

Why private companies in space ISRO Chairman sensational answer
  • దేశ అవసరాలు తీర్చేందుకు ఇస్రోతో పాటు ప్రైవేట్ రంగం అవసరమన్న నారాయణన్
  • ప్రస్తుతం 56 శాటిలైట్లు ఉండగా.. అవసరం వందల్లో ఉందని వెల్లడి
  • స్పేస్‌ ఎకోసిస్టమ్‌ విస్తరణతో ఉద్యోగాలు పెరుగుతాయని వివరణ
  • ప్రైవేట్‌ రంగానికి ఇస్రో పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడి
  • జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ IIతో ఇప్పటివరకు అత్యంత బరువైన శాటిలైట్‌ను ప్రయోగం
దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరగడంపై వస్తున్న విమర్శలకు ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ వి. నారాయణన్‌ స్పందించారు. భారత్‌లో పెరుగుతున్న అవసరాలను ఇస్రో ఒక్కటే తీర్చలేదని స్పష్టం చేశారు. దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థతో పాటు మొత్తం స్పేస్‌ ఎకోసిస్టమ్‌ మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం దేశం వద్ద 56 శాటిలైట్లు ఉన్నాయని, కానీ అవసరం మాత్రం వందల సంఖ్యలో ఉందని నారాయణన్‌ తెలిపారు. అందుకే ప్రభుత్వం అంతరిక్ష రంగంలో సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ప్రైవేట్‌ సంస్థలు కూడా ఈ రంగంలోకి రావడం ద్వారా మరిన్ని శాటిలైట్లు తయారవుతాయని చెప్పారు. దీంతో ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ఈ కార్యకలాపాలకు ఇస్రో అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు.

ఇదిలా ఉంటే శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ఈఓఎస్‌-05 ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌ II వాహక నౌకతో ఇప్పటివరకు ప్రయోగించిన అత్యంత బరువైన శాటిలైట్‌ ఇదేనని నారాయణన్‌ తెలిపారు.

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-II సామర్థ్యం తొలినాళ్లలో 1,536 కిలోలుగా ఉండేదని చెప్పారు. ఇప్పుడు దాని సామర్థ్యం దాదాపు 40 శాతం పెరిగిందన్నారు. తాజా ప్రయోగం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

కులశేఖరపట్నం స్పేస్‌పోర్ట్‌ నిర్మాణ పనులు షెడ్యూల్‌ ప్రకారం సాగుతున్నాయని నారాయణన్‌ వెల్లడించారు. మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు గగన్‌యాన్‌ కార్యక్రమం కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని తెలిపారు. ఈ ఏడాదే తొలి మానవరహిత మిషన్‌ను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Advertisement
V Narayanan
ISRO
Indian Space Sector Reforms
GSLV F17 EOS 05 Mission
Private Space Companies India
Gaganyaan Mission Update

More Telugu News