'ఆవారాపన్-2’ బ్లాక్ బస్టర్ హిట్: ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ దిశా పటానీ
- రూ. 200 కోట్ల మార్క్ దాటిన 'ఆవారాపన్-2'
- ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా తెరకెక్కిన చిత్రం
- మంచి వ్యక్తులతో పని చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్న దిశ
ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా దర్శకుడు నితిన్ కక్కర్ తెరకెక్కించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ‘ఆవారాపన్ -2’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణతో ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న దిశా పటానీ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ప్రేక్షకులందరూ ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అద్భుతమైన కథను చెప్పే ఈ ప్రయాణంలో, ఇంత మంచి మనసున్న వ్యక్తులతో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక బృందంలో భాగం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నానని, ‘ఆవారాపన్-2’ చిత్రంపై ప్రేక్షకులు కురిపిస్తున్న అపారమైన ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినై ఉంటానని తెలిపారు. ఈ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించడం తన అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు.
2007లో మోహిత్ సూరి దర్శకత్వంలో ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్ జంటగా వచ్చిన ‘ఆవారాపన్’ చిత్రం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి కేవలం రూ. 12 కోట్లు మాత్రమే రాబట్టి ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన దీని సీక్వెల్ ‘ఆవారాపన్-2’ మాత్రం రూ. 200 కోట్ల మార్కును దాటి ఘన విజయం సాధించింది.