'జైలర్ 2' విడుదలపై వదంతులకు చెక్.. అనుకున్న తేదీకే వస్తున్న టైగర్ ముత్తువేల్ పాండియన్

Rajinikanth Jailer 2 release rumors cleared Tiger Muthuvel Pandian arriving on scheduled date
  • 'జైలర్ 2' వాయిదా వార్తలకు చెక్ పెట్టిన మేకర్స్
  • అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల అని స్పష్టత
  • కొత్త పోస్టర్‌తో విడుదల తేదీని ప్రకటించిన చిత్రబృందం
  • పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యంతో వాయిదా అంటూ ప్రచారం
  • భారీ తారాగణంతో తెరకెక్కుతున్న నెల్సన్ దిలీప్‌కుమార్ చిత్రం
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' సినిమా విడుదలపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ చిత్రం వాయిదా పడుతోందంటూ వస్తున్న వార్తలకు చిత్ర నిర్మాణ సంస్థ ఫుల్‌స్టాప్ పెట్టింది. ముందుగా ప్రకటించినట్లే దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసి అభిమానుల్లో జోష్ నింపింది.

2023లో విడుదలై సంచలన విజయం సాధించిన 'జైలర్' సినిమాకు సీక్వెల్‌గా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే, సినిమా షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, దీనివల్ల సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొట్టడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ వదంతులను ఖండిస్తూ ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది.

వాయిదా వార్తల్లో నిజం లేదని చెప్పిన మేకర్స్, విడుదల తేదీని మరోసారి క‌న్ఫర్మ్‌ చేస్తూ కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో రజనీకాంత్ చేతిలో తుపాకీ పట్టుకుని సీరియస్ లుక్ తో కనిపిస్తున్నారు. దీంతో 'జైలర్ 2' దసరా బరిలో ఉండటం ఖాయమని తేలిపోయింది.

ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. రజనీతో పాటు రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య, విద్యా బాలన్, సూరజ్ వెంజరమూడు, మిర్నా, యోగిబాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేగాక మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర తారలు ప్రత్యేక అతిథి పాత్రల్లో మెరవనుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. బ్లాక్ బస్టర్ 'జైలర్'కు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. తాజా ప్రకటనతో సినిమాపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి.
Advertisement
Rajinikanth
Jailer 2 Release Date
Nelson Dilipkumar
Sun Pictures
Anirudh Ravichander
Tiger Muthuvel Pandian

More Telugu News