ముద్ర లోన్ అప్రూవ్డ్ మెసేజ్‌లా? జాగ్రత్త, ఇది కొత్త మోసం!

Mudra Loan approved messages Beware this is a new scam
  • ముద్ర లోన్ మంజూరైందంటూ వచ్చే వాట్సాప్ మెసేజ్‌లు నకిలీవి
  • ఇవి మోసగాళ్లు పంపుతున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
  • ఆధార్, పాన్ వివరాలు ఎవరికీ పంపవద్దని ప్రజలకు సూచన
  • అధికారికంగా బ్యాంకుల్లోనే ముద్ర లోన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచన
  • ముద్ర సంస్థ నేరుగా ప్రజలకు రుణాలు ఇవ్వదని వెల్లడి
ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద రుణం మంజూరైందంటూ వాట్సాప్‌ వేదికగా సర్క్యులేట్ అవుతున్న నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కొందరు దుండగులు ఇటువంటి సందేశాల ద్వారా ప్రజల నుంచి ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది.

"మీ ముద్ర లోన్ దరఖాస్తు ఆమోదించబడింది" అంటూ వచ్చే సందేశాలు పూర్తిగా నకిలీవని, ప్రభుత్వం ఇటువంటి సమాచారాన్ని వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పంపించదని కేంద్రం స్పష్టం చేసింది. ముద్ర అనేది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు పునఃరుణసహాయం (రీఫైనాన్స్) అందించే సంస్థ మాత్రమేనని, వ్యక్తులకు లేదా వ్యాపారా సంస్థలకు నేరుగా రుణాలు మంజూరు చేయదని వివరించింది.

ముద్ర రుణాల మంజూరు కోసం ఎటువంటి ఏజెంట్లు లేదా మధ్యవర్తులు లేరని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అర్హులైన వారు నేరుగా సమీపంలోని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), లేదా మైక్రో ఫైనాన్స్ సంస్థలను (ఎంఎఫ్ఐ) సంప్రదించి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా, అధికారిక 'ఉద్యమమిత్ర' పోర్టల్ (udyamimitra.in) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని తెలిపింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి అనుమానాస్పద సందేశాలు వచ్చినా, వాటిని factcheck.pib.gov.in పోర్టల్‌కు పంపి వాస్తవాలను నిర్ధారించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
Advertisement
Pradhan Mantri Mudra Yojana
PIB Fact Check
WhatsApp scam
Loan fraud
Udyami Mitra portal

More Telugu News