రైతు ఇంటికి సీఎం విజయ్.. బామ్మకు సర్‌ప్రైజ్ గిఫ్ట్

CM Vijay visits farmer house surprise gift to grandmother
  • సేలం జిల్లాలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన
  • రైతు ఇంట్లో ఆకస్మికంగా ఆగిన ముఖ్యమంత్రి
  • సీఎంను చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైన బామ్మ
  • తన కళ్లజోడును బామ్మకు బహుమతిగా ఇచ్చిన విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పర్యటనలో ఒక రైతు కుటుంబానికి అనూహ్య రీతిలో ఆశ్చర్యాన్ని కలిగించారు. మంగళవారం సేలం జిల్లాలో పర్యటించిన ఆయన, ఒక గ్రామంలో ఆకస్మికంగా ఆగి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలు చూపిన ఆత్మీయతకు ముగ్ధుడైన ఆయన, తాను ధరించిన కళ్లజోడును ఆమెకు బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సేలం జిల్లాలోని మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి, సాగునీటిని విడుదల చేసే క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగించుకుని చెన్నైకి తిరుగుప్రయాణమైన ఆయన, మార్గమధ్యలోని చిన్నకావూరు గ్రామం వద్ద తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. నేరుగా రామస్వామి అనే రైతు నివాసానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పలకరించారు.

ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు ముఖ్యమంత్రిని చూడగానే అమితానందానికి లోనయ్యారు. ఆత్మీయంగా ఆయన్ను ఆలింగనం చేసుకుని, చేతిని గట్టిగా పట్టుకుని తన అనురాగాన్ని చాటుకున్నారు. అనంతరం తన పెరట్లోని తోటను ఆయనకు చూపించారు. ఆమె అభిమానానికి చలించిన విజయ్, తక్షణమే తాను ధరించిన కళ్లజోడును తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, విజయ్ ఆ బామ్మకు బహూకరించిన సన్ గ్లాసులు వరల్డ్ క్లాస్ సంస్థ 'క్రిస్టియన్ డయోర్' తయారు చేసినవి. వీటి ధర రూ.50 వేలకు పైనే ఉంటుంది.
Advertisement
Vijay
Tamil Nadu CM
Salem District
Mettur Dam
Farmer House Visit
Surprise Gift

More Telugu News