ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంపై అభాండాలు వేయడం సరికాదు: బండి సంజయ్

Bandi Sanjay says false allegations on MPLADS funds utilization are not right
  • తన నియోజకవర్గానికి కేటాయించిన నిధుల్లో 94.1 శాతానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయన్న సంజయ్
  • ఏకపక్ష నివేదికలు ఇవ్వడం సరికాదని వ్యాఖ్య
  • క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని హితవు

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా వెనుకబడ్డారంటూ 'ఎంపవర్డ్ ఇండియన్' సంస్థ విడుదల చేసిన నివేదిక సత్యదూరమని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను ఆయన గణాంకాలతో సహా మీడియాకు వివరించారు.


కేంద్ర ప్రభుత్వం తన నియోజకవర్గానికి రూ. 17.50 కోట్లు కేటాయించగా, అందులో ఏకంగా 94.1 శాతం నిధులకు (రూ. 16.47 కోట్లు) సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాళ్లు, బోర్‌వెల్స్, సీసీ రోడ్ల వంటి ప్రజావసరాల కోసం గత మూడేళ్లలో 627 ప్రతిపాదనలను కలెక్టర్లకు పంపగా, వాటిలో 82.29 శాతం పనులకు ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. అంతేకాకుండా, గతంలో 16వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బి. వినోద్ కుమార్ ఖర్చు చేయకుండా వదిలేసిన రూ. 2.5 కోట్ల నిధులను కూడా తానే ఉపయోగించినట్లు గుర్తుచేశారు.


స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇచ్చే నిధులు చాలడం లేదని, ప్రతి ఏటా ఎంపీ లాడ్స్ కోటాను పెంచాలని ఎంపీలంతా విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో ఇలాంటి ఏకపక్ష నివేదికలు ఇవ్వడం అన్యాయమని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు నుంచి కలెక్టర్ల ఆమోదం, పనుల అమలు వరకు అనేక దశలు ఉంటాయని... ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ నిధులన్నీ ప్రాసెస్ అయ్యాయని తెలిపారు. ప్రజల విజ్ఞప్తుల కోసం సీఎస్‌ఆర్ నిధులను కూడా సేకరిస్తున్నామని పేర్కొన్న ఆయన, ఇకనైనా వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని సదరు సంస్థకు హితవు పలికారు.

Advertisement
Bandi Sanjay
MPLADS funds
Karimnagar MP
Empowered Indian report
MP fund utilization
Telangana politics

More Telugu News