బటన్ నొక్కడం కాదు.. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం: మొగల్తూరులో చంద్రబాబు

Chandrababu Naidu at Praja Vedika Meeting in Narsapuram Serving the Poor
  • మొగల్తూరులో చంద్రబాబు సభ 
  • పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి
  • మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, డ్వాక్రా సంఘాలకు ప్రోత్సాహం అందిస్తామని హామీ
  • నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే తన ఆశయమని స్పష్టీకరణ
  • పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా
"గత పాలకులు బటన్ నొక్కి చేతులు దులుపుకొన్నారు, రోడ్ల నిండా గుంతలు పెట్టారు. కానీ మేం అలా కాదు.. ప్రతి అవ్వాతాత ఇంటికి వచ్చి వారికి గౌరవంగా పెన్షన్ అందిస్తున్నాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు సూత్రాలతో ముందుకు సాగుతోందని ఆయన పునరుద్ఘాటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని మొగల్తూరులో మంగళవారం నిర్వహించిన 'పేదల సేవలో ప్రజా వేదిక' కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఆయన ప్రారంభించి ప్రసంగించారు.

గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఉండేదని, తమ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికిందని చంద్రబాబు అన్నారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన గత పాలకుల తీరును ఆయన తప్పుబట్టారు. ఇప్పుడు తాము నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి, పెంచిన పెన్షన్లను అందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్న చంద్రబాబు, 31 ఏళ్ల క్రితం ఇదే రోజు (సెప్టెంబరు 1) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణస్వీకారం చేశానని, అప్పటి నుంచి ప్రజా చైతన్యం, ప్రజా భాగస్వామ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు పెన్షన్ల రూపంలో రూ.73,507 కోట్లు అందించామని, గత రెండేళ్లలో సంక్షేమ పథకాల కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.

మహిళా సాధికారత నుంచి సామాజిక న్యాయం వరకు

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చంద్రబాబు అన్నారు. పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టిన డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా నిలబెట్టామని, ఇప్పుడు 'దీపం-2.0' పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని చెప్పారు. గత ఏడాది లక్ష మంది డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈలుగా ఎదిగారని, ఈ లక్ష్యాన్ని మరింత పెంచుతామని, వారు తయారు చేసే ఉత్పత్తులకు 'స్వయం' బ్రాండ్‌తో మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే 'స్త్రీశక్తి' కార్యక్రమం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి వారిపై ఆర్థిక భారం తగ్గించామని అన్నారు.

సంక్షేమం అంటే కేవలం డబ్బులు పంచడం కాదని, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడమేనని సీఎం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో ఇంకా ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా వడ్డెర్లకు మైనింగ్‌లో, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణను అమలు చేసి సామాజిక న్యాయం చేశామని గుర్తుచేశారు.

అభివృద్ధి, సాంకేతికతతో నవశకం

నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరవు నేలకు కృష్ణా జలాలు అందించామని, శ్రీశైలం నుంచి మార్కాపురం వరకు నీళ్లు పారించడం తన జీవితంలో ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రేపు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించబోతున్నామని, గోదావరి నీటిని అనకాపల్లి, విశాఖ మీదుగా వంశధార వరకు తీసుకెళ్తామని ప్రకటించారు.
గత పాలకులు పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును అంధకారం చేశారని విమర్శించారు. 

తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోందని, విద్యుత్ సంస్థలను సమర్థంగా నిర్వహిస్తూ 'ట్రూ డౌన్' ద్వారా ఛార్జీల భారాన్ని తగ్గించామని తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ.1.5కే అందిస్తున్నామని, ప్రపంచ మార్కెట్లో ఏపీ ఆక్వా ఉత్పత్తులను అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు. ప్రజా పాలనలో సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తామని, ఏఐ ట్యూటర్, ఏఐ డాక్టర్ వంటి వ్యవస్థలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, 1.60 కోట్ల కుటుంబాలకు ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వ సేవలు అందించే వ్యవస్థను రూపొందిస్తామని వెల్లడించారు. నర్సాపురం అభివృద్ధికి ఆక్వా కల్చర్ యూనివర్సిటీ, డంప్ యార్డు, డెల్టా ఆధునికీకరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

ఏకగ్రీవాలు వద్దనడం వారి ఓటమి భయానికి నిదర్శనం

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే 'గొడ్డలి పార్టీ' స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఏకగ్రీవాలను వద్దనడం వారి ఓటమి భయానికి నిదర్శనమని, గతంలో ప్రభుత్వాలే ఏకగ్రీవాలను ప్రోత్సహించాయని గుర్తుచేశారు. ఆయారాం-గయారాంలను అరికట్టేందుకు మేయర్, చైర్మన్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో పెట్టామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కూడా తగ్గించి ఆ వర్గాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
NTR Bharosa Pension
Narsapuram Praja Vedika
Andhra Pradesh Welfare Schemes
Deepam 2 Scheme
AP Development Projects

More Telugu News