Advertisement

వెలిగొండ సభలో చంద్రబాబు ర్యాంప్ వాక్.. వీడియో ఇదిగో!

Chandrababu Naidu ramp walk at Veligonda meeting watch video
  • వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు
  • సభా వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలను ఉత్సాహపరిచిన వైనం
  • 30 ఏళ్ల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని వ్యాఖ్య
  • కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర ఈ ప్రాజెక్టు అని అభివర్ణన
  • ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల దశాబ్దాల సాగునీటి కలకు తొలి అడుగు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులో ఇవాళ సరికొత్త ఉత్సాహం ఉప్పొంగింది. అందుకు వెలిగొండ సభ వేదికైంది. మార్కాపురం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ఆయన విజయోత్సాహంతో ర్యాంప్ వాక్ చేశారు. చేతిలోని పచ్చ కండువాను గిరగిరా గాల్లోకి తిప్పుతూ, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయన ఉత్సాహభరిత నడకను చూసి సభకు భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కేరింతలు, చప్పట్లతో మారుమోగించారు. సభకు వచ్చిన రైతులు కూడా తమ పచ్చ కండువాలు ఊపుతూ చంద్రబాబు సంతోషంలో పాలుపంచుకున్నారు.

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, కరవు పీడిత ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను జాతికి అంకితం చేసిన చారిత్రక సందర్భంలో చంద్రబాబు ఆనందం స్పష్టంగా కనిపించింది. దోర్నాల మండలంలో ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ, ఇది కేవలం ప్రాజెక్టు కాదని, "కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర" అని అభివర్ణించారు. 30 ఏళ్ల క్రితం, 1996లో తాను శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నానని గుర్తుచేశారు. "వెలిగొండ బంగారు కొండ కావాలి" అని ఆనాడు తాను ఇచ్చిన హామీని నెరవేర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.

శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను గ్రావిటీ ద్వారా నల్లమల సాగర్‌కు తరలించి, కరవు ప్రాంతాలకు జీవం పోయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తాజాగా ప్రారంభమైన మొదటి దశ ద్వారా 10.70 టీఎంసీల నీటిని విడుదల చేసి, తద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పూర్తి కావడంతో స్థానిక రైతులు, ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు పర్యటన, సభలో ఆయన ప్రదర్శించిన ఉత్సాహం... ప్రాజెక్టు పూర్తి కావడంపై ఆయనకున్న సంతృప్తిని, రైతుల పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది.



Advertisement
Chandrababu Naidu
Veligonda Project
Chandrababu Naidu ramp walk
Andhra Pradesh irrigation projects
Markapuram Veligonda meeting
TDP yellow scarf celebration

More Telugu News