Advertisement

30 ఏళ్ల వయసులో ఇల్లు కొనాలా? పెట్టుబడి పెట్టాలా? 20 ఏళ్ల తర్వాత తేడా చూస్తే షాకవుతారు!

Buying A House At 30 vs Investing At 30
  • ఇల్లు కొనడం కంటే పెట్టుబడితో ఎక్కువ సంపద
  • రూ.1.2 కోట్ల ఇంటి ఉదాహరణలో భారీ తేడా
  • 20 ఏళ్ల తర్వాత ఇంటి విలువ రూ.4.23 కోట్లుగా అంచనా
  • పెట్టుబడి పోర్ట్‌ఫోలియో విలువ రూ.7.60 కోట్లకు చేరే అవకాశం
  • రెండు మార్గాల మధ్య సంపద తేడా రూ.3.37 కోట్లు
30 ఏళ్లు వచ్చాయంటే సొంత ఇల్లు కొనాలనే ఆలోచన చాలామందికి వస్తుంది. ఇందుకోసం భారీ హోమ్‌లోన్‌ తీసుకోవాలా? లేక అద్దె ఇంట్లో ఉంటూ అదే డబ్బును పెట్టుబడిగా పెట్టాలా? ఈ రెండు మార్గాల్లో 20 ఏళ్ల తర్వాత సంపదలో భారీ తేడా ఉండొచ్చని ఓ ఆర్థిక విశ్లేషణ చెబుతోంది.

అందుకోసం ఇద్దరు వ్యక్తులను ఉదాహరణగా తీసుకుందాం. ఒకరు రూ.1.2 కోట్ల ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. రూ.24 లక్షలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించి, మిగతా రూ.96 లక్షలకు 8.75 శాతం వడ్డీతో 20 ఏళ్ల రుణం తీసుకున్నారు. నెలకు దాదాపు రూ.84,800 ఈఎంఐ అవుతోంది. నిర్వహణ, పన్నులు కలిపితే నెలవారీ ఖర్చు సుమారు రూ.90 వేలకు చేరుతుంది.

మరో మహిళ అదే తరహా ఇంటిని రూ.28 వేల అద్దెకు తీసుకుంటుంది. తన వద్ద ఉన్న రూ.24 లక్షలను ఈక్విటీ పెట్టుబడుల్లో పెడుతుంది. ఇంటి ఈఎంఐతో పోలిస్తే మిగిలే రూ.62 వేలతో నెలనెలా ఎస్‌ఐపీ చేస్తుంది.

20 ఏళ్ల తర్వాత ఎవరి సంపద ఎక్కువ?
ఇక్కడే అసలు తేడా కనిపిస్తుంది. ఇంటి విలువ ఏటా 6.5 శాతం పెరిగితే.. 50 ఏళ్ల వయసులో ఇంటి విలువ సుమారు రూ.4.23 కోట్లు అవుతుంది. మరోవైపు ఈక్విటీల్లో సగటున 12 శాతం రాబడి వస్తే పెట్టుబడిదారు పోర్ట్‌ఫోలియో విలువ రూ.7.60 కోట్లకు చేరుతుంది. అంటే దాదాపు రూ.3.37 కోట్ల తేడా.

ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణాల్లో హోమ్‌లోన్‌ వడ్డీ ఒకటి. రూ.96 లక్షల రుణంపై 20 ఏళ్లలో సుమారు రూ.1.07 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు డౌన్‌పేమెంట్‌ డబ్బును ముందుగానే పెట్టుబడి పెడితే దానిపై కూడా దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావం ఉంటుంది.

అయితే ప్రతి ఒక్కరికీ అద్దె, పెట్టుబడి మార్గమే ఉత్తమమని చెప్పలేం. కుటుంబ స్థిరత్వం కోసం ఇల్లు అవసరమైతే కొనుగోలు చేయడం సమంజసం. ఇల్లు కొనాలనుకునేవారు ముందుగా 3-5 ఏళ్ల ఖర్చులకు సరిపడే నగదు నిల్వ ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం హౌసింగ్‌ ఖర్చు నికర ఆదాయంలో 35 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిదని చెబుతున్నారు.
Advertisement
Home
Home Loan
Investments

More Telugu News