మంగ్లీని కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరు?: అడ్వకేట్ సుబ్బు

Mangli controversy Advocate Subbu claims he rejected crore offer and questions Central Minister protection
  • మంగ్లీతో తాను రాజీ పడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న సుబ్బు
  • నిందితురాలిగా ఉన్న మంగ్లి స్వేచ్ఛగా విదేశాలకు వెళుతోందని విమర్శ
  • కేసులో కీలక సాక్షి అయిన డ్రైవర్ ఏమయ్యాడని ప్రశ్న

మైక్రో ఫైనాన్స్ కేసు వివాదంలో ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ ముసురుకున్న ఆరోపణల వ్యవహారం మరింత తీవ్రరూపం దాలుస్తోంది. మంగ్లీతో తాను రాజీ పడినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను న్యాయవాది సుబ్బు ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ... కేసు ఉపసంహరణ కోసం మంగ్లీ మనుషుల నుంచి రూ. కోట్లలో ఆఫర్ వచ్చిందని, కానీ తాను దానిని తిరస్కరించిన విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు.


కోర్టుల్లో మంగ్లీపై తాను వేసిన పిటిషన్లతో పాటు, తనపై మంగ్లీ చేసిన నిరాధారమైన ఫిర్యాదుల కేసులు ఇప్పటికీ విచారణలోనే ఉన్నాయని సుబ్బు స్పష్టం చేశారు. తీవ్రమైన అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అమెరికాలోని ఎన్నారై తెలుగు నిర్వాహకులు అంతర్జాతీయ వేదికలపై ఎలా అవకాశాలు ఇస్తారని ప్రశ్నించారు. కేసులో నిజానిజాలు తేలేవరకు ఆమెకు విదేశీ షోలలో అవకాశాలు ఇవ్వకూడదని, ఈ విషయమై ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


బాధితుల పక్షాన నిలబడ్డ తమను ఊరు దాటవద్దని పోలీసులు ఆంక్షలు విధిస్తుంటే, నిందితురాలిగా ఉన్న మంగ్లీ స్వేచ్ఛగా విదేశాలకు ఎలా వెళ్తోందని నిలదీశారు. ఆమె అరెస్ట్ కాకుండా వెనుకుండి కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరో ప్రజలే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఈ కేసులో కీలక సాక్షి అయిన డ్రైవర్ ఏమయ్యాడు? అతడిని మంగ్లీతో లాలూచీ చేయించింది ఎవరు? అని సంచలన ప్రశ్నలు గుప్పించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేదే లేదని స్పష్టం చేశారు.

Advertisement
Mangli
Advocate Subbu
Microfinance Case
Central Minister
Singer Mangli Controversy
Telugu Singer Mangli Case

More Telugu News