ఎవరి జాగీరు అని మీ ఫొటోలు వేసుకుంటున్నారు?: కాంగ్రెస్ నేతలపై ఈటల ఫైర్
- కేసీఆర్ పాలనకు, రేవంత్ పాలనకు తేడా లేదన్న ఈటల
- సన్న బియ్యం కేంద్రం ఇస్తున్నా మోదీ ఫొటో వేయడం లేదని మండిపాటు
- కేంద్ర నిధుల వల్లే రాష్ట్రంలో రోడ్లు, రైల్వేలు అభివృద్ధి చెందుతున్నాయని వ్యాఖ్య
తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనకు ఎలాంటి వ్యత్యాసం లేదని... ఈ పాలనతో రాష్ట్ర ప్రజలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని భావిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఐదు కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నప్పటికీ ప్రధాని మోదీ ఫొటోను ఎక్కడా వేయడం లేదని... కానీ కాంగ్రెస్ నేతలు ఎవరి జాగీరని వారి ఫొటోలు వేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి దేశంలో మత కల్లోలాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారని విమర్శించిన ఈటల, గతంలో కాంగ్రెస్ హయాంలోనే లుంబిని పార్క్, గోకుల్ చాట్‌లలో బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లినప్పుడు మోదీ ఆశీర్వాదం కావాలని కోరే సీఎం రేవంత్... ఇక్కడకు వచ్చాక మాత్రం విమర్శలు చేయడం ఆయన ద్వంద్వ విధానానికి నిదర్శనమన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల వల్లే రాష్ట్రంలో రహదారులు, రైల్వేలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు వేసి, కాంగ్రెస్ నాయకులకు కేటాయించుకుంటున్నారని ఈటల మండిపడ్డారు. 'ఇది మీ తాత జాగీరు కాదు' అంటూ ఈటల మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు, మెట్రో ఫేజ్-1, ఫేజ్-2లకు తగిన సహాయం అందిస్తోందని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి, మేడ్చల్ పరిధిలోని పలు రైల్వే గేట్ల వద్ద ఆర్‌వోబీ, ఆర్‌యూబీ నిర్మాణాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ అంశంపై సీఎస్‌ను కలిసి చర్చించానన్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి స్టేషన్ల అభివృద్ధికి అమృత్ పథకం కింద కేంద్రం రూ.22 కోట్లు ఇస్తోందని ఈటల వెల్లడించారు.