ఇందిరమ్మ ఇళ్లకు లక్కీ డ్రా.. 28 నుంచి ఫ్లాట్ల కేటాయింపు

Indiramma Houses Lucky Draw Flat Allocation From August 28
  • హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు లక్కీ డ్రా
  • ఆగస్టు 28 నుంచి 31 వరకు ఫ్లాట్ల కేటాయింపు
  • మొత్తం 40,900 మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం
  • మరో నాలుగు నియోజకవర్గాల్లో కొత్తగా ఇళ్ల నిర్మాణం
  • టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్‌) పరిధిలో పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీ డ్రా ద్వారా ఫ్లాట్లను కేటాయించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు.

తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. మొత్తం 60,720 దరఖాస్తులు రాగా, క్షుణ్ణంగా పరిశీలించి 40,900 మందిని అర్హులుగా, 19,820 మందిని అనర్హులుగా గుర్తించామన్నారు. అనర్హతకు గల కారణాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎంపిక కానివారికి ఈఎండీ రూ.10 వేలను వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.

ఆగస్టు 28 నుంచి 31 వరకు వివిధ ప్రాంతాల్లో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు మంత్రి షెడ్యూల్ ప్రకటించారు. 28న కౌకూర్, పాటిగడ్డ, జల్‌పల్లి, కుల్సుంపురలో, 29న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్‌పల్లి వంటి ప్రాంతాల్లో, 30న గాజుల రామారం, అంబర్‌పేట, 31న రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీలలో డ్రా ఉంటుందని వివరించారు.

అంతేకాకుండా, మరో నాలుగు నియోజకవర్గాల్లో కొత్తగా ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎల్‌బీనగర్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో మొత్తం 1,920 ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. వీటికి సెప్టెంబరు 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Advertisement
Ponguleti Srinivas Reddy
Indiramma Houses Lucky Draw
Indiramma Towers Flat Allocation
Hyderabad Housing Scheme
Telangana Housing Department
Indiramma Houses Beneficiary Selection

More Telugu News